చేర్యాల, మే 15 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీలను గురువారం ఆలయంలో లెక్కింపులు జరిపారు. 48 రోజుల్లో స్వామి వారి హుండీ ఆదాయం రూ.90,09,170 లభించింది. ఆలయ హుండీలను మహా మండపంలో ఆలయ ఈవో ఎస్.అన్నపూర్ణ ఆధ్వర్యంలో మెదక్ ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ కార్యాలయ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో కొమురవెల్లి ఎస్ఐ రాజు బందోబస్తు మధ్య లెక్కింపులు జరిగాయి. ఆలయంలోని 24 హుండీలకు ఆలయ అర్చకులు, ఉద్యోగులు, తాత్కలిక సిబ్బంది, శివరామకృష్ణ సేవా సమితి సభ్యులు లెక్కింపులు జరిపారు.
తాజా లెక్కింపులో రూ.90,09,170 నగదుతో పాటు, 96గ్రాముల మిశ్రమ బంగారం, 9కిలోల 50 గ్రాముల మిశ్రమ వెండి, 14క్వింటాళ్ల బియ్యం, 22 నోట్లు ఇతర దేశాల కరెన్సీ లభించింది. ఈ సందర్భంగా ఆలయంలో ఈవో విలేకరులతో మాట్లాడుతూ ఆలయంలోని 24 హుండీల ద్వారా లభించిన నగదును స్ధానిక ఎస్బీఐలో జమ చేశామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకుడు శ్రీరాములు, సురేందర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్,పాలక మండలి సభ్యులు కొప్పురపు జయప్రకాశ్‌రెడ్డి, లింగంపల్లి శ్రీనివాస్, కాయితా మోహన్‌రెడ్డి, వలాద్రి అంజిరెడ్డి, అర్చకులు,ఆలయ సిబ్బంది, ఒగ్గు పూజారులు, తాత్కలిక సిబ్బంది, బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.