కొండపాక (కుకునూర్‌పల్లి), జూన్ 5 : ద్విచక్ర వాహనం పై వెళ్లున్న పోలీస్ కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని కారు వెనక నుంచి ఢీ కొట్టడంతో తీవ్రమైన గాయాలైన సంఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎదుట గురువారం చోటు చేసుకుంది.
కోహెడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వేణు గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చి తిరిగి సిద్దిపేటకు వెళ్లున్న క్రమంలో కమిషనర్ ఆఫీస్ బయటకు రాగానే తన వెనుకాలే వచ్చిన కారు వెనక నుంచి బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో కానిస్టేబుల్ రోడ్డు పై పడిపోయాడు. ప్రమాద అనంతరం కారు డ్రైవర్ తన కారును ఆపకుండా బైక్‌ను 100 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి రోస్ రెస్టారెంట్ వద్ద వదిలి వెళ్లి పోయింది. 108 వాహనంలో క్షతగాత్రుడిని సిద్దిపేట ఏరియా దవాఖానకు తరలించారు.