Harish Rao | సిద్దిపేట జిల్లా తడ్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు జోగు వెంకటేశం పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా విధానాలపై, ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. అనంతరం పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయుడి సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తెచ్చాం. మొదటి విడతలోనే తడ్కపల్లి స్కూల్‌ను ఎంపిక చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాం. డిజిటల్ క్లాసులు, డ్యూయల్ డెస్క్‌లు, డైనింగ్ హాల్, తాగునీరు, టాయిలెట్స్ ఇలా అన్ని వసతులు కల్పించాం. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమాన్ని ఆపేసింది. గత మూడేళ్లలో రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క కొత్త క్లాస్ రూమ్ కట్టిందా..? అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.
రాష్ట్రంలో 27,000 పాఠశాలలను కేవలం 4,000 పాఠశాలలకు తగ్గిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబుతున్నారు. అంటే బడులను మూసేస్తారా..? ఒకపక్క ఉపాధ్యాయులు ప్రతి నెలా రిటైర్ అవుతున్నారు. వారి స్థానంలో కొత్త టీచర్లను భర్తీ చేయడం లేదు. డీఎస్సీ వేయరు, కనీసం విద్యా వాలంటీర్లనైనా పెట్టుకునే అవకాశం ఇవ్వరు. కేవలం సర్దుబాట్లు, డిప్యూటేషన్ల పేరుతో కాలం వెళ్లదీస్తుండటంతో ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది.
తక్షణమే డీఎస్సీ నిర్వహించి తీరాలి, ఆలోపు విద్యా వాలంటీర్లను నియమించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలి.పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు 2024 నుంచి ఇప్పటివరకు సరిగ్గా జీతాలు ఇవ్వలేదు. నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లో పెడితే వాళ్లు ఎలా బతకాలి. హెడ్ మాస్టర్లు జేబులోంచి ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జీవితకాలం పనిచేసి రిటైర్ అవుతున్న ఉద్యోగులకు వారు సొంతంగా దాచుకున్న జీపీఎఫ్, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోంది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15% కమీషన్ లంచంగా ఇచ్చుకోవాల్సి వస్తోందని ఓ ఉపాధ్యాయురాలు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను మనమంతా చూశాం. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ ఊసే లేదు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని ఎన్నికల్లో చెప్పి.. మూడేళ్లయినా కనీసం ఒక కమిటీ వేయలేదు, చర్చలు జరపలేదు. మధ్యాహ్న భోజనం వండే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. బయట మార్కెట్లో కోడిగుడ్డు ధర 8 రూపాయలు ఉంటే.. ప్రభుత్వం మాత్రం 3.50 పైసలు, 4 రూపాయలు ఇస్తే వాళ్లు పిల్లలకు ఎలా వండి పెడతారని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం తెచ్చిన బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ బంద్ పెట్టారు. మళ్లీ ఏదో ప్రారంభిస్తున్నాం అన్నారు కానీ, సిద్దిపేట జిల్లాను పక్కనపెట్టి కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. వచ్చే 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యలన్నింటినీ లేవనెత్తి, ప్రభుత్వం మెడలు వంచుతాం. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో రిటైర్మెంట్ కార్యక్రమాలు ఉన్నప్పటికీ, జోగు వెంకటేశం మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమ, గౌరవంతోనే నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను.ఆయన కేవలం బడికే పరిమితమైన మాస్టారు కాదు, సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే గొప్ప మనసున్న వ్యక్తి అన్నారు.
జోగు వెంకటేశం సిద్దిపేటలోని అభయాంజనేయ స్వామి దేవాలయానికి అధ్యక్షుడిగా ఉంటూ, అనేక చిక్కుముడులు విడదీసి ఆ గుడిని అద్భుతంగా అభివృద్ధి చేశారు. పద్మశాలి సమాజానికి గౌరవ అధ్యక్షుడిగా ఉంటూ పేదలు, అట్టడుగు వర్గాల పిల్లల చదువుల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈ స్కూల్లో పిల్లలు నిలబడే ఈ ప్రార్థనా వేదిక తన సొంత డబ్బులతో కట్టించిన సేవాభావం ఆయనది. ఒకసారి తడ్కపల్లి బీసీ హాస్టల్ పిల్లలు కింద పడుకుంటున్నారని వెంకటేశం నాకు మెసేజ్ పెడితే, నేను వెంటనే నా సొంత డబ్బులతో పిల్లలకు బెడ్స్ కొని పంపించానన్నారు హరీశ్ రావు.
తాను సహాయం చేయడమే కాకుండా, పూర్వ విద్యార్థులైన స్కైలాబ్ రెడ్డి, మల్లేశం లాంటి వారిని మోటివేట్ చేసి ప్రతి ఏటా లక్ష రూపాయలు స్కూల్‌కు విరాళంగా ఇప్పించి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయించారు. డాక్టర్ సతీష్ సహకారంతో వాటర్ ప్లాంట్ పెట్టించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులోనూ ముందున్నారు. 61 ఏళ్లు రాగానే ఉద్యోగానికి రిటైర్మెంట్ తప్పదు కానీ, ఆయన సేవలకు రిటైర్మెంట్ లేదు. ఆయన కోసం దేవాలయం, సమాజ సేవ పనులు ఎన్నో ఎదురుచూస్తున్నాయి. వెంకటేశం మంచి ఆయురారోగ్యాలతో, తన కుటుంబంతో ఆనందంగా గడపాలని, ఆయన శేష జీవితంలో మాతో కలిసి మరింత సామాజిక సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Novak Djokovic: తొలి రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్.. యూఎస్ ఓపెన్‌లో ఏడ్చిన జోకోవిచ్
Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!
SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే