Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని.. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదిలి పడావు పెట్టిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సిద్ధిపేట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. నంది మేడారంలో కటక ఒత్తితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వస్తాయి. కానీ ఎందుకు నీళ్లను సముద్రంలో వదులుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్సీ.. నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది కానీ రేవంత్ రెడ్డికి, ఉత్తంకుమార్ రెడ్డికి తెలియదన్నారు.
కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే రేవంత్ రెడ్డి కనులప్పగించి చూస్తున్నాడు . కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన మీ అబద్ధాన్ని నిజం చేసేందుకే మోటార్లను ఆన్ చేయడం లేదా..? రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు మంత్రి ఉన్నాడా.. ? ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా. వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు నింపితే యాసంగిలో లక్షల ఎకరాల పంట పండుతుంది. వెంటనే మోటార్లను ఆన్ చేసి రోజుకి రెండు టీఎంసీలు నీళ్లు మిడ్ మానేరుకు, అక్కడినుండి మిగతా రిజర్వాయర్లకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం మోటార్లను కక్షపూరితంగా పనికిరాకుండా చేయాలని రోజుకు రెండుసార్లు ఆన్ ఆఫ్ చేస్తున్నారు.
రాజకీయాల కోసం మాట్లాడటం లేదు రైతుల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న. ఈ రాష్ట్ర మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్న. వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి.. లేదంటే రైతులతో వేలాది మందిగా కదిలి వచ్చి మేమే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరిస్తున్నామని ప్రభుత్వానికి .
ఇది రాష్ట్ర ప్రభుత్వ క్రిమినల్ నెగ్లిజెన్సీ..
రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతులపై పగా ప్రతీకారం తీర్చుకుంటున్నదని.. అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదని హితవు పలికారు.ప్రజలకు కీడు చేస్తే అది ప్రభుత్వమే అనబడదన్నారు హరీశ్ రావు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టును పడావు పెట్టింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. కడెం ప్రాజెక్టుకు మధ్యాహ్నం తర్వాత 1,50,000 క్యూసెక్కుల వరద వస్తుంది. సాయంత్రం వరకు ఈ పూర్తి వరద కడెం ప్రాజెక్టు నుండి శ్రీపాద ఎల్లంపల్లికి వస్తుంది. నంది మేడారం గాయత్రి పంప్ హౌస్ కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాగా ఉంది. నంది మేడారంలో కటక ఒత్తితే రోజుకి రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ మానేరులో పడతాయి. వారం రోజుల కిందనే ఈ విషయాన్ని ఉత్తంకుమార్ రెడ్డికి తెలుపుతూ ఉత్తరం రాశాను.
అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి. వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని ప్రభుత్వానికి విన్నపం చేశాను. దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లెత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారు.
నీళ్ల విలువ రైతులకు తెలుస్తది ఉత్తంకుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి తెలియదు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయం చేసే ఒక రైతు. ఆయన రైతు గనుక ప్రతి చుక్కను ఒడిసిపట్టి నీళ్లను రైతులకు అందించారు. మీరు ఎన్నడు వ్యవసాయం చేయలేదు అందుకే మీకు నేల విలువ తెలియదు. ఈ రోజు కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే రేవంత్ రెడ్డి. ఉత్తంకుమార్ రెడ్డి గుడ్లప్పగించి చూడడం తప్ప ఏం చేయడం లేదు.మీ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.