Christmas celebrations| రాయపోల్, డిసెంబర్ 25 : సిద్దిపేట జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని చర్చిలను విద్యుత్ దీపాలు, రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు.
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి, రాయపోల్, వడ్డేపల్లి, బేగంపేట తదితర గ్రామాల్లో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలను విద్యుత్ దీపాలు, పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు.
ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలివచ్చి ఏసు క్రీస్తుకు ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం పాస్టర్లు శ్యాం కుమార్, ప్రవీణ్ మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని, గ్రామాల్లో ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఏసు దేవుడిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాల్లో క్రైస్తవులతో పాటు ఇతర మతాలకు చెందిన ప్రజలు కూడా పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాలన్నింటిలో పండుగ వాతావరణం నెలకొని ఆనందోత్సాహాలతో క్రిస్మస్ వేడుకలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్. సీనియర్ నాయకులు
సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు
కరుణామయుని దీవెనలతో సమస్త లోకం సంతోషంగా ఉండాలి : జీడిపల్లి రాంరెడ్డి
తొగుట: ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త ఆకాంక్షలు, సంతోషాలను తీసుకురావాలని క్రైస్తవ సోదర,సోదరిమణులకు తొగుట మండల బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మండలంలో వెంకట్రావుపేట లోని చర్చిలలో సర్పంచ్ బండారు కవిత స్వామి గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో సబ్బండ వర్గాలను, అన్ని మతాల వారికి సమాన గౌరవం కల్పించడం జరిగిందన్నారు. క్రైస్తవ సోదరుల కోసం హైదరాబాద్‌లో క్రైస్తవ భవన్ నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. పేద క్రైస్తవ సోదరులకు బట్టలు పంపిణీ చేయడంతోపాటు ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి ప్రజల మధ్య మత సామరస్యం పెంపొందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
హిందువులకు బతుకమ్మ, ముస్లీం సోదరులకు రంజాన్.. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగల సందర్భంగా.. రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రోత్సాహకాలు అందించి గౌరవాన్ని అందించడం జరిగిందన్నారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా.. క్రిస్మస్ చెట్టులా పచ్చగా..ఆకాశంలో నక్షత్రాల్లా ప్రకాశవంతంగా వారి జీవితాలు ఉండాలని, శాంతి , సద్భావన, ప్రేమ, గొప్ప ఆనందం దక్కాలని కోరుకుంటూ.. పాస్టర్లు సత్యం, జాకారియాలకు, క్రిస్టియన్ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ లచోల్ల లింగం, గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య, వార్డు సభ్యులు, జహంగీర్ వెంకటేశం శ్రీనివాస్ నర్సింలు. క్రైస్తవ సోదరులు రాజు, చంద్రశేఖర్, అమృతారావు, కర్ణాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
