సిద్దిపేట, మే 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సిద్దిపేట గడ్డ మీద మనం అందరం ప్రతిజ్ఞ తీసుకుందాం. సిద్దిపేట నుంచే లక్ష ఓట్ల మెజార్టీ ఇద్దాం ..మనం అందరం పౌరుషవంతులం.. మాట నిలబెట్టుకోవాలి. లక్ష ఓట్ల మెజార్టీ ఇక్కడి నుంచే ఇవ్వాలి. తాను ఏ రోజు వచ్చినా మాబిడ్డ కదా.. మా కన్న బిడ్డ కదా అన్న ప్రేమను ఎప్పుడూ వచ్చినా మీరు చూపిస్తున్నారు. అదే ప్రేమతో లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలి’.. అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి సిద్దిపేటలో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. ముస్తాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ సిద్దిపేట పాత బస్టాండ్ వద్దకు చేరుకుంది. జన సందోహాన్ని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ…ఒకనాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో తాను కరీంనగర్ పోతా ఉంటే ఉద్యమం కోసం పో అని చెప్పి గుండెలనిండా ధైర్యం ఇచ్చి పంపించిన నాగడ్డ ఈ సిద్దిపేట అని కేసీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి ముందుగా సిద్దిపేట మట్టికి నా వందనం. చాలా గొప్ప స్వాగతం చెప్పారు. నాగుండెల నిండా బ్రహ్మాండమైన సంతోషం కలిగింది. హరీశ్‌రావు చెప్పినట్టు మన అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మీ అందరికీ తెలుసన్నారు.
ఆయన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా పని చేశారన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇదే అంబేద్కర్ చౌరస్తాలో సిద్దిపేట జిల్లా కావాలని తాను అడిగానని, కానీ.. ఎవ్వరూ కూడా జిల్లా చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తానే ముఖ్యమంత్రి అయినంక, హరీశ్‌రావు మంత్రి అయిన తర్వాతనే సిద్దిపేట జిల్లా చేసుకున్నామన్నారు. సిద్దిపేట జిల్లా చేయడమే కాదు ..రైలు తెచ్చుకున్నాం..గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం..సిద్దిపేట జిల్లా చేసుకున్నామన్నారు. కానీ, జాగ్రత్త అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తానంటున్నది..సిద్దిపేట జిల్లా ఉండాలా..? సిద్దిపేట జిల్లా తీస్తా అంటే యుద్ధం చేద్దామా..? మరొక యుద్ధ్దానికి సిద్ధ్దమైదామా..? ( సిద్ధ్దమైదామని ప్రజలు నినదించారు). ఈ మూర్ఖ ముఖ్యమంత్రి జిల్లాలను రద్దు చేస్తా అంటున్నాడని కేసీఆర్ చెప్పారు. ప్రజలకు పరిపాలన తేవాలని జిల్లా తెస్తే, దానిని రద్దు చేస్తా నంటున్నాడన్నారు. వచ్చిన సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి చాలా సేవలు అందించారన్నారు. మీ గ్రామాల్లో ఉన్న మొక్కలు వెంకట్రామిరెడ్డి నాటించినవే అని కేసీఆర్ చెప్పారు.
హరీశ్ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి…
హరీశ్ నాయకత్వంలో సిద్దిపేటలో బ్రహ్మాండమైన అభివృద్ది చేసుకున్నామని కేసీఆర్ చెప్పారు. ఆ అభివృద్ధి, మన హక్కులు రావాలంటే, మన నీళ్లు మనకే ఉండాలంటే వెంకట్రామిరెడ్డి గెలువాలన్నారు. మొన్నటి ఎన్నికల్లో హరీశ్‌కు ఇచ్చిన మెజార్టీ కన్నా ఇంకో 20 వేల మెజార్టీ ఎక్కువ ఇచ్చి మొత్తం లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చి వెంకట్రామిరెడ్డిని గెలపించాలన్నారు. సిద్దిపేట మెజార్టీ లక్ష ఉండాలి ..ఇప్పుడే డిక్లేర్ చేస్తున్న, సిద్దిపేట మెజార్టీతోనే వెంకట్రామిరెడ్డి ఎంపీగా గెలిచిపోయిండన్నారు. ఈ గెలుపులో సిద్దిపేట జిల్లా గెలుపు ఉన్నది..మెదక్ పార్లమెంట్ గెలుపు ఉన్నదన్నారు. వెంకట్రామిరెడ్డి డబ్బులకు ఆశపడి, పదవులకు ఆశపడి వచ్చిన వ్యక్తి కాదన్నారు. ఆయనకు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఉందన్నారు. ఆయన ఒక్క మాట చెప్పాడన్నారు. ఎంపీగా గెలపిస్తే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ఏడు కల్యాణ మండపాలు కట్టిస్తానని చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తుచేశారు. ఒక్క రూపాయికే పేదలకు ఫ్రీగా పెండ్లికి ఇస్తానని చెప్పారన్నారు. రూ. 100 కోట్లతో ట్రస్టు పెట్టి పేద విద్యార్థులందరికీ చదువు చెప్పిస్తా అని చెప్పారన్నారు. ఇటువంటి నాయకుడు గెలిస్తే మన అందరి, ప్రజల గౌరవం అందరికీ లాభం అని చెప్పారు. తన మాట (కేసీఆర్) హరీశ్ మాట మీద విశ్వాసం ఉంచి లక్ష మెజార్టీ సిద్దిపేట నుంచి ఇవ్వాలని కోరారు. సిద్దిపేట మీరు ఎటువంటి పులులో తనకు తెలుసన్నారు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే లక్ష ఓట్ల మెజార్టీ మీకో లెక్క కాదన్నారు. లక్ష కదా.. గ్యారెంటీగా (పక్కా లక్ష ఓట్ల మెజార్టీ ఇస్తాం అంటూ ప్రజల నినాదాలు). హరీశ్ నాయకత్వంలో మే 13వ తేదీ వరకు అందరూ కూడా ఈ రోజు ఏ ఉత్సాహంతో తనకు స్వాగతం చెప్పినారో..ఇంక బ్రహ్మాండమైన పద్ధ్దతిలో నేల ఈనిందా అన్నట్టు సభకు వచ్చినారో, అదే పద్ధతిలో కష్టపడి వెంకట్రామిరెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ సిద్దిపేట నుంచి ఇవ్వాలని కేసీఆర్ కోరారు.
రంగనాయక సాగర్‌ను ఎండబెట్టిర్రు..
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రంగనాయక సాగర్‌ను ఎండబెట్టింది అని కేసీఆర్ అన్నారు. రైతుల పంటలను ఎండిబెట్టిందన్నారు. కాంగ్రె స్ పార్టీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఏది కూడా అమలు అవుతదని ఆశ కూడా లేదన్నారు. ఆరోజు రూ.30 వేల కోట్లు రెండు దఫాలుగా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిందన్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న చేస్తానన్న రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశారన్నారు. ఏది కూడా అమలు జరగలేదన్నారు. ఆరు ప్రధాన హామీల తోపాటు 420 హామీలు ఇస్తే ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలను ఒక కోడి తన పిల్లలను కాపాడుకున్నట్లుగా అందరనీ దగ్గరికి తీసుకొని మనం ముందుకు పోయామని కేసీఆర్ చెప్పారు.
సిద్దిపేట మట్టి బిడ్డకు నీరాజనం
సిద్దిపేట ప్రతినిధి/ సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, మే 10: సిద్దిపేటలో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. సిద్దిపేట మట్టి బిడ్డ కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు రైతులు, మహిళలు, యువకులు వేలాదిగా తరలివచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి కేసీఆర్ రాక కోసం ముస్తాబాద్ చౌరస్తా వద్ద ప్రజలు వేచి ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిద్దిపేట ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కేసీఆర్ రాకతో సిద్దిపేట పట్టణం జనసంద్రంగా, గులాబీమయంగా మారింది. సిద్దిపేట పురవీధుల్లో ఎటు చూసినా..జన సందోహం కనిపించింది. సిరిసిల్ల హైవే నుంచి సిద్దిపేట రింగ్ రోడ్డు మీదుగా శివాజీ చౌక్ నుంచి సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఒగ్గు కళాకారుల నృత్యాలు, బోనాలు, ఫ్లకార్డుల ప్రదర్శనలు ఆకర్షించాయి. దారిపొడవునా బస్సులో ఉన్న కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తూ.. హారతులు పట్టి గుమ్మడి కాయలతో దిష్టి తీశారు. మోడల్ బస్టాండ్ వద్ద క్రేన్ సాయంతో భారీ గజమాలను కేసీఆర్‌కు వేశారు. గొల్లకుర్మలు గొంగడిని అందజేయగా.. కేసీఆర్ కప్పుకున్నారు. అభిమానులు గదను బహూకరించారు. శివాజీ చౌరస్తా వద్ద పోలీసులు బస్సులు ఆపడంతో జనం అక్కడి నుంచే కేసీఆర్‌ను చూసేందుకు సుమారు 2 కి.మీలు నడిచి వచ్చారు.
తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్
సిద్దిపేట/సిద్దిపేట అర్బన్, మే 10: సిద్దిపేట ప్రజలు కేసీఆర్‌ను ఆశీర్వదించి పంపిస్తే.. తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చిన మహనీయుడు కేసీఆర్ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని మోడల్ బస్టాండ్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో హరీశ్‌రావు మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లాతోపాటు రైలు, గోదావరి నీళ్లు తెచ్చిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి సిద్దిపేట పేరును చరిత్ర పుటల్లో నిలిపిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఇదే స్ఫూర్తిని, ఉత్సాహాన్ని మరో మూడు రోజులపాటు కొనసాగించాలని సూచించారు. వెంకట్రామిరెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ అందించి సిద్దిపేట అభివృద్ధికి సహకరించాలన్నారు.