Palla Rajeshwar Reddy | మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 08: వచ్చే వానకాలం నుంచి మూడు ఫేజ్‌లలో నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం నాడు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మద్దూరు మండలంలోని లద్నూర్ ఒక మంచి గ్రామం. ఇక్కడున్న రైతులు కష్టం చేసి మంచిగా పంటలు పండిస్తుంటారని తెలిపారు. లద్నూర్ రిజర్వాయర్ లీకేజీ అవుతుందని రైతులు అనేకసార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. లీకేజీని అరికట్టేందుకు కొంత ప్రయత్నం చేసిన లీకేజీని పూర్తిస్థాయిలో అరికట్టలేకపోయారని పేర్కొన్నారు. లద్నూర్ రిజర్వాయర్‌ను పూర్తిగా నింపుకునేందుకు గండిరామారం నుంచి నీళ్లు రావాల్సి ఉందన్నారు. కానీ ఓఎండీ సిబ్బంది 34 రోజుల పాటు సమ్మె చేయడంతో ఆ నీరు రాలేకపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓఎండీ సిబ్బందిని రెక్వెస్ట్ చేసి, చివరికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పిన తర్వాత నీళ్లు వచ్చాయని చెప్పారు.
బొమ్మకూరు లెప్ట్ కెనాల్ నుంచి లద్నూర్ మీదుగా తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి నీళ్లు వెళ్లుతుంటాయని అన్నారు. గతంలో దేవాదులలో 350 క్యూసెక్కుల నీళ్లు ఫేజ్-1లో, 550 క్యూసెక్కుల నీళ్లు ఫేజ్-2లో వచ్చేవని గుర్తుచేశారు. మూడో ఫేజ్‌లో 1800ల క్యూసెక్కుల నీళ్ల విడుదల కోసం గత ప్రభుత్వం నిర్ణయించగా ఈ ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని తెలిపారు. కాబట్టి వచ్చే వానాకాలం నుంచి మూడు పంపుల ద్వారా నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరారు. మూడు ఫేజ్‌లలో నీళ్లు వేస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. మొదటి నుంచే పార్టీలకతీతంగా నీళ్లు తీసుకొస్తేనే ఈ ప్రాంత రైతులు బాగుపడుతారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో కోతలు లేకుండా రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని సూచించారు.