రాయపోల్, మే06: ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరై గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు అధికంగా కురిసి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పెద్ద ఆరేపల్లి గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని గ్రామస్తులు ఐక్యంగా ఉండి గత మూడు రోజుల నుంచి ఉత్సవాలు నిర్వహించుకోవడం పట్ల ఆయన అభినందించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు, పండుగలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన ఘనత దక్కిందన్నారు.
పెద్దమ్మ ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలి
దౌల్తాబాద్ మండలం మాచిన్ పల్లి గ్రామ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్ పర్సన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆలయాలు నిర్మించుకొని ఆధ్యాత్మిక భావన వైపు వెళ్లడాన్ని ఆయన అభినందించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపుగా గ్రామాల్లో ఆలయాలు నిర్మించుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని వారు సూచించారు.