Paddy Field | తొగుట, జనవరి 27 : పెద్దమాసాన్పల్లి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతులు వరి నాట్లు వేస్తున్నారని, కొందరు ఇప్పటికే నాటు పనులు పూర్తిచేశారని తెలిపారు. నాటు వేసిన రైతులు ప్రస్తుతం నాచు సమస్యను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పొలంలో నాచు పొర మాదిరిగా ఏర్పడి వేర్లకు ఆక్సిజన్ అందకుండా చేస్తుందని, ఫలితంగా వేర్లు కుళ్ళిపోవడం, పంట ఎదుగుదల తగ్గిపోవడం, ఆకులు ఎర్రబడడం, పిలకల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. నాటిన 7 నుండి 20 రోజుల లోపు నాచును నియంత్రిస్తే పంట పిలకలు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
నాచు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పొలంలో నీటిని దీర్ఘకాలం మార్చకపోవడం, అధికంగా యూరియా వినియోగించడం, పొలం చదునుగా లేకపోవడం, మురుగు నీరు ఒకే చోట నిల్వవ్వడం వంటి కారణాలు ప్రధానమని నాగార్జున తెలిపారు.
రైతులకు నివారణ చర్యలను సూచిస్తూ..
పొలాన్ని 2–3 రోజులు ఆరబెట్టాలని, 20–25 రోజుల్లో కలుపుతోపాటు నాచును చేత్తో తొలగించాలని ఏఈఓ నాగార్జున చెప్పారు. అదనంగా ఎకరానికి 250 గ్రాముల కాపర్ సల్ఫేట్ను బట్టలో కట్టి, బోరు నుండి పొలంలోకి నీరు వచ్చే కాలువలో 10 రోజులపాటు ఉంచితే నాచు తగ్గుతుందని వివరించారు. అయితే మోతాదుకు మించి వాడరాదని హెచ్చరించారు.
నాచు తొలగించిన తర్వాత ఎకరానికి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలని, అలాగే లీటర్ నీటికి 2 గ్రాముల కార్బెండజిమ్ + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.