రఘునాథపాలెం, మార్చి 11: ఖమ్మం భూదాన్ బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. పేదల ఇళ్లను కూల్చిన భూదాన్ భూముల్లోనే వారికి 75 గజాల చొప్పున స్థలాలు మంజూరు చేసింది. ఆ స్థలాల పట్టాలను ఖమ్మం కలెక్టరేట్లో బుధవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. అయితే, 750 ఇళ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హత పేరుతో చాలామంది పేర్లను తొలగించింది. కేవలం 412 మందిని మాత్రమే అర్హులుగా తేల్చింది. వారిలో 311 మంది మాత్రమే బుధవారం ఇళ్ల స్థలాల పట్టాలను, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రులు పంపిణీ చేశారు. ఇందులో మిగిలిన 101 మందికి వారి స్వగ్రామాల్లో స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. అయితే, తాము అర్హులమైనప్పటికీ తమను అనర్హుల జాబితాలో చేర్చారంటూ పట్టాలు పంపిణీ సమయంలో పలువురు పేదలు ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.10 లక్షల ఇల్లు కూల్చి.. ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా?
రూ.పది లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటిని కూల్చి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనడం ఎలాంటి న్యాయమో చెప్పాలి. మా ఇల్లు కట్టుకోవడం కోసం రెక్కలు ముక్కలయ్యేలా కష్టపడ్డాం. ఒంటిపై ఉన్న బంగారమంతా తాకట్టు పెట్టాం. మరో రూ.4 లక్షలు అప్పు చేశాం. అంతా కలిపి రూ.10 లక్షలు జమ చేసి ఇంటిని నిర్మించుకున్నాం. ఆ అప్పు కూడా ఇంకా తీరలేదు. ఉన్నంతలో ఓ సొంత గూటిని నిర్మించుకున్నాం. అలాంటి ఇంటిని ఒక్కసారిగా నేలమట్టం చేసి మాకు నిలువనీడ కూడా లేకుండా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడేమో కంటితుడుపు చర్యల్లాగా మాట్లాడుతోంది. ఇంటి స్థలం పట్టాను, ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని చేతిలో పెట్టింది. మొదట రూ.10 లక్షలతో కట్టుకున్న ఇంటి అప్పే ఇంకా తీరలేదు.
ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మళ్లీ ఎక్కడ అప్పు తేవాలి? భూదాన్ భూముల్లోని మాలాంటి పేదలను వెళ్లగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చింది. మా ఇళ్లను కూల్చివేయడంతో వస్తున్న వ్యతిరేకతను చూసే మళ్లీ అదే భూముల్లో స్థలాలు ఇస్తూ పట్టాలు అందజేసింది. పేదల ఇళ్లను కూల్చిన ప్రభుత్వానికి మనుగడ అసలే ఉండదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను అసలే ఓటు వేయను. మాతోపాటు ఇల్లు కట్టుకొని ఏళ్లుగా నివాసం ఉంటున్న అనేక మందిని అనర్హుల జాబితాలో చేర్చారు. వారికి కూడా మాకు ఇచ్చినట్లుగానే పట్టాలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలి. లేకుంటే వారి కోసం మేమంతా కలిసి మళ్లీ పోరాటం చేస్తాం.
-పోతురాజు ప్రశాంతి, పట్టాపొందిన లబ్ధిదారురాలు