హుస్నాబాద్ టౌన్, డిసెంబర్ 13 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని హుస్నాబాద్ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. పట్టణానికి సరిపడా మొక్కల పెంచడంతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఏటా ఇండ్లలో పెంచుకునే మొక్కలకు తోడు రహదారులకు ఇరువైపులా పెంచే మొక్కలను స్థానికంగా పెంచుతున్నారు.
నర్సరీలో 70 వేల మొక్కల పెంపకం..
పట్టణ శివారులోని ఎకరం స్థలంలో పట్టణ నర్సరీని ఇటీవల నిర్మించారు. టీయూఎఫ్ఐడీసీకి చెందిన రూ.35 లక్షల వ్యయంతో నర్సరీకి ప్రహరీ, షెడ్ నెట్, డ్రిప్ తదితర నిర్మాణాలు చేపట్టారు. పట్టణ ప్రగతికి చెందిన రూ.10 లక్షల వ్యయంతో పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కల పెంపకాన్ని మున్సిపల్ పాలకవర్గం చేపట్టింది. ఇందుకు కోసం ప్రత్యేకంగా షెడ్‌ను నిర్మించడమే కాకుండా డ్రిప్ ద్వారా మొక్కలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
నర్సరీలకు తోడు ప్రకృతి వనాలు..
పట్టణ ప్రజలకు అవసరమైన మొక్కలను స్థానికంగా పెంచేందుకు దామెర కుంటతోపాటు మరో మూడు ప్రాంతాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు 70 వేల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఇందులో గులాబీ, మల్లె, కానుగు, టేకు మొక్కలతోపాటు వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.
మొక్కల కొనుగోళ్లు బంద్..
ఏటా జూన్‌లో పారంభమయ్యే హరితహారం కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి దాదాపు 50 వేలకుపైగా మొక్కలను కొనుగోలు చేసేవారు. దీనికి దాదాపు ఇరువై లక్షల వరకు ఖర్చు అయ్యేవి. మొక్కలతోపాటు ట్రీగార్డులు తదితర సామగ్రికి కొనుగోలు చేసేవారు. పాలకవర్గం నర్సరీల ఏర్పాటు కోసం స్థలాలను సేకరించి ఆయా ప్రాంతాల్లో మొక్కలు పెంచడంతో మున్సిపాలిటీకి లక్షల రూపాయల ఆదాయం మిగులుతుంది.
రూ.20 లక్షలతో ఓపెన్ జిమ్..
పట్టణవాసుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు మున్సిపల్ పాలకవర్గం ఓపెన్ జిమ్‌ను నిర్మించింది. పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు కట్టకింద రూ.20 లక్షలతో ఈ జిమ్ ను ఇటీవల నిర్మించారు. పట్టణవాసులు పెద్ద సంఖ్యలో మార్నింగ్ వాక్కు వెళ్లే ప్రాంతంలో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే నర్సరీ, ఓపెన్ జిమ్ ప్రారంభం..
పట్టణంలో నిర్మించిన నర్సరీతోపాటు ఓపెన్ జిమ్‌ను ప్రారంభించేందుకు త్వరలోనే మున్సిపల్ పాలకవర్గం ప్రయత్నం చేస్తున్నది. పది రోజుల్లోనే రెండింటిని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు కృషి..
పట్టణవాసులకు ఆరోగ్యం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తు న్నాం. ఇంతకుముందు మొక్కలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి వార్డుల్లో ప్రజలకు సరఫరా చేసేవాళ్లం. ఇప్పుడు నర్సరీలను ఏర్పాటు చేసి స్వయంగా మొక్కలు పెంచుతున్నాం. వీటికి తోడు ఆరోగ్యాన్ని పెంచేందుకు జిమ్‌లను సైతం ఏర్పాటు చేశాం. త్వరలోనే వీటిని ప్రారంభిస్తాం.
– రజితావెంకన్న, మున్సిపల్ చైర్పర్సన్