Indiramma Illu | మిరుదొడ్డి, జూన్ 11 : ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలోని బండారు పల్లి గ్రామంలో బుధవారం నాడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బండారుపల్లి గ్రామానికి చెందిన నీరటి పర్శరాములు (42) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తనకు సొంత ఇల్లు లేకపోవడంతో భార్య ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇల్లు మంజూరైందని కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయనే ఆశతో రెండు లక్షలు అప్పు చేసి బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం చేశాడు.
కొద్దిరోజుల తర్వాత మొదట ఎంపిక చేసిన జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందని పర్శరాములుకు కొందరు నాయకులు చెప్పారు. దీంతో ఇందిరమ్మ ఇల్లు రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన పర్శరాములు తన ఇంటిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.