కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 6: భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరులో ఓ జవాన్ సహా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఫోదేవాడ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో బామ్రాగఢ్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో 14 సీ-60 జవాన్ల యూనిట్లు ఆ ప్రాంతంలో గురువారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో గురువారం రాత్రి ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్టు అధికారులు తెలిపారు. మావోయిస్టుల కాల్పుల్లో కమాండో దీపక్ చిన్నా మడవి మృతిచెందారు. మృతుల్లో 10వ నెంబర్ కంపెనీ ఇన్చార్జి ప్రభాకర్ ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభాకర్‌పై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.