ఇండోర్, జూలై 29: అమ్మాయి అని చెప్పి ట్రాన్స్‌జెండర్‌తో పెండ్లి చేసి తనను మోసగించారంటూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన 32 ఏండ్ల యువకుడు కొత్వాలి పోలీసులను ఆశ్రయించాడు. తమ సంతానం ట్రాన్స్‌జెండర్ అన్న విషయాన్ని దాచి తనతో వివాహం చేసి మోసగించిన అత్తామామలు సహా ఐదుగురిపై ఫిర్యాదు చేశాడు.
షాజపూర్‌లో కూరగాయల వ్యాపారి అయిన బాధితుడు.. తనకు జూన్ 29న హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక గుడిలో వివాహం జరిగినట్టు చెప్పాడు. పెండ్లికి ఐదు లక్షలు ఖర్చు చేయడమే కాక, వధువు కుటుంబానికి లక్ష రూపాయల నగదు కూడా ఇచ్చానని తెలిపాడు. అయితే పెండ్లయిన తర్వాత వివిధ సాకులు చూపుతూ తన భార్య, వారి కుటుంబ సభ్యులు శోభనాన్ని వాయిదా వేయడంతో భర్తకు అనుమానం వచ్చిందని తెలిపాడు.
ఒక రోజు తన భార్య గడ్డం గీసుకోవడం చూసి అమె ట్రాన్స్‌జెండర్ అని నిర్ధారణ చేసుకున్నాడు. ఈ విషయమై నిలదీసినా వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని, తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు పోలీసులకు మొరపెట్టుకున్నాడు. వైద్య పరీక్షలు చేసిన తర్వాతే ఆమె ట్రాస్స్జెండరా? కాదా? అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారు ఆరోపణలు నిజమని తేలితే అతని భార్య, కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేస్తామని చెప్పారు.