చెన్నై, జూలై 29: ఒక కొత్త అంటువ్యాధి నుండి రక్షణ కోసం తలనీలాలు సమర్పించుకుంటే రూ. 15,000 ప్రోత్సాహకం ఇస్తానని ప్రభుత్వ అధికారిగా నమ్మబలికిన ఒక మోసగాడి మాటలు నమ్మి తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు తమ తలనీలాలు సమర్పించుకున్నారు. ప్రభు త్వ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చిందని బాధిత మహిళల్లో ఒకరు తెలిపారు.
కోవిడ్-19ని పోలి ఉండే ఒక కొత్త అంటువ్యాధి మానవ కేశాల ద్వారా వ్యాపిస్తున్నదని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. వ్యాధిని నివారించడానికి గుండు చేయించుకోవడం అవసరమని చెప్పాడు. దీన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిందని,
ప్రతి మహిళకు రూ.15,000, పాఠశాల, కళాశాలలకు వెళ్లే బాలికలకు రూ. 45,000తోపాటు ఒక ల్యాప్‌టాప్ కూడా లభిస్తాయని అతను నమ్మబలికాడు. ఈ మాటలు నమ్మి 20 మంది తలనీలాలు ఇవ్వడానికి సంసిద్ధమయ్యారు. అయితే ముగ్గురు మహిళలు గుండు కొట్టించుకుని ప్రభుత్వ అధికారుల రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఎంతకీ వారు రాకపోవడంతో ఆ మోసగాడికి ఫోన్ చేయగా స్విచాఫ్‌లో ఉంది. దీంతో తాము మోసపోయామని గుర్తించారు. మిగిలిన మహిళలు తమ తలనీలాల సమర్పణ ఆలోచనను మార్చుకున్నారు.