న్యూఢిల్లీ: గిగ్ వర్కర్ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిబ్రవరి 7న(శనివారం) ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. ఆలిండియా బ్రేక్‌డౌన్ పేరిట సమ్మె చేయనున్నట్లు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ), ఇతర జాతీయ కార్మిక సంఘాలు ప్రకటించాయి.
ఫిబ్రవరి 7న దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత రవాణా కార్మికులు ఆల్ ఇండియా బ్రేక్‌డౌన్ పాటిస్తారని టీజీపీడబ్ల్యూయూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించింది. యాప్ ఆధారిత డ్రైవర్లు పేదరికంలోకి జారుకుంటుంటే అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లు లాభాలు గడిస్తున్నాయని, కేంద్రం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైందని యూనియన్ విజ్ఞప్తి చేసింది.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత రవాణా కార్మికులను దెబ్బతీస్తున్నాయని కేంద్ర మంత్రి గడ్కరీకి రాసిన లేఖలో టీజీపీడబ్ల్యూయూ తెలిపింది. ఓలా, ఉబర్, ర్యాపిడో, పోర్టర్, ఇతర ఆటో, క్యాబ్, బైక్-ట్యాక్సీ అగ్రిగేటర్లు, కంపెనీలతో పనిచేసే డ్రైవర్లకు సదరు కంపెనీలే ఏకపక్షంగా చార్జీలు నిర్ణయిస్తున్నాయని, వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని యూనియన్ పేర్కొన్నది. ఈ పద్ధతి వల్ల తీవ్ర ఆదాయ అభద్రత, దోపిడీ, దర్భర పని పరిస్థితులను లక్షలాది మంది రవాణా కార్మికులు అనుభవిస్తున్నారని యూనియన్ తెలిపింది.