రాయపోల్, జూలై 16: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్‌పల్లి నుంచి దౌల్తాబాద్‌కు రావాలంటేనే గ్రామస్తులు జంకుతున్నారు. ఉప్పర్‌పల్లి నుంచి దౌల్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లాలంటే రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది.దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు సైతం ఇక్కట్లు తప్పడం లేదు. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప్పర్‌పల్లి-దౌల్తాబాద్ రోడ్డు మరమ్మతులకు రూ.కోటి 7లక్షలు మం జూరు చేసింది. ఉప్పర్‌పల్లి గ్రామస్తులు అప్పటి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కానీ నేటి వరకు రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లను రద్దు చేసింది. దీంతో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉప్పర్‌పల్లి బీటీ రోడ్డుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉప్పర్‌పల్లి నుంచి దౌల్తాబాద్ వరకు గుంతలమయంగా మారిన రోడ్డును బీటీగా మార్చాలి.ప్రభుత్వాలు మారినా ఉప్పర్‌పల్లి రోడ్డుకు మరమ్మతులు చేయడం లేదు. ఉప్పర్‌పల్లి నుంచి మండల కేంద్రానికి రావాలంటే గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత చదువుల కోసం ఎక్కడికైనా వెళ్లాలంటే గుంతలరోడ్డు, చిన్నపాటి వర్షాలకు మొత్తం అస్తవ్యస్తంగా మారుతుంది. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి విన్నవించగా బీటీరోడ్డు కోసం నిధులు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లను రద్దు చేసింది. ప్రభుత్వం స్పందించి ఉప్పర్‌పల్లి -దౌల్తాబాద్ మండల కేంద్రానికి వచ్చే రోడ్డుకు మరమ్మతులు చేయాలి.