అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసేందుకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ డబ్బు పంపిణీ, మద్యం సరఫరాకు అడ్డుకట్ట వేయడానికి సీవిజిల్ యాప్ను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. నిఘా బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వహించేలా శిక్షణ నిర్వహించారు. ప్రిసైడింగ్, సెక్టోరియల్ అధికారులకు వీవీ ప్యాట్ మిషన్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లపై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొదటి రౌండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 9,25,398 మంది ఓటర్లు ఉండగా.. 1,151 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మహిళా ఓటర్లు 4,68,140 మంది, పురుష ఓటర్లు 4,57,178 మంది ఉన్నారు.
సిద్దిపేట అర్బన్, అక్టోబర్ 27 : రాబోయే అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి పకడ్బందీగా అమలు చేసేందుకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ డబ్బు చలామణి, మద్యం సరఫరా వంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ‘సీ విజిల్’ యాప్ను ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అంతే కాకుండా నిఘా బృందాలు సమర్థవంతంగా, నిస్పక్షపాతంగా విధులు నిర్వహించేలా శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ రోజు ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్, సెక్టోరియల్ అధికారులకు వీవీ ప్యాట్ మిషన్, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లపై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.
ఎన్నికల్లో జరిగే అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ‘సీ విజిల్’ యాప్ను రూపొందించింది. ఎవరైనా కోడ్ ఉల్లంఘించినా, పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లకు డబ్బు, మద్యం, బహుమతుల వంటివి ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తే ఆ వివరాలను నేరుగా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అక్రమాలకు సంబంధించిన ఫొటో యాప్లో అప్లోడ్ చేస్తే 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని.. 100 నిమిషాల సమయంలో దర్యాప్తు చేసి ఫిర్యాదు దారుడికి సమాచారం తెలియజేస్తారు. అదే విధంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టరేట్లో 1950 కంట్రోల్ రూమ్ నెంబర్ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల సంబంధిత అనుమతులను సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో రిటర్నింగ్ అధికారి నుంచి తీసుకోవాలి. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు ప్రతి నియోజకవర్గానికి 3ఎంసీసీ టీమ్లు, 3 వీడియో సర్వైలెన్స్ టీమ్లు, 3 స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్లను ఏర్పాటు చేశారు.
సిద్దిపేట జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొదటి రౌండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ర్యాండమైజేషన్ ప్రకారం ఎలక్షన్ బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్లను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్కాన్ చేసి దుబ్బాక, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. సిద్దిపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యవేక్షణలో ఈవీఎం యంత్రాలను నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేసి పోలీస్ బందోబస్తు మధ్య నియోజకవర్గ కేంద్రాలకు పంపించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
సిద్దిపేట జిల్లాలో మొత్తం 9,25,398 మంది ఓటర్లు ఉండగా.. 1,151 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మహిళా ఓటర్లు 4,68,140 మంది ఉండగా.. పురుష ఓటర్లు 4,57,178 మంది ఉన్నారు. ఇందులో జిల్లాలో హుస్నాబాద్(32) నియోజకవర్గంలో 304 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. 2,36,575 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 1,19,406 మంది ఉండగా.. పురుషులు 1,17,165 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. సిద్దిపేట(33) నియోజకవర్గంలోని 273 పోలింగ్ కేంద్రా ల్లో మొత్తం 2,28,523 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 1,15,520 మంది ఉండగా.. పురుషులు 1,12,934 మంది, ఇతరులు 69 మంది ఉన్నారు. దుబ్బాక(41) నియోజకవర్గంలోని 253 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,94,664 మంది ఓటర్లు ఉండగా.. మహిళలు 99,359 మంది ఉండగా.. పురుషులు 95,305 మంది ఉన్నారు. గజ్వేల్(42) నియోజకవర్గంలోని 321 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 2,65,636 మంది ఉండగా.. ఇందులో మహిళలు 1,33,855 మంది ఉండగా.. పురుషులు 1,31,774 మంది ఉండగా.. ఏడుగురు ఇతరులుఉన్నారు. అంతే కాకుండా జిల్లాలో 19 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు ఉండగా.. 451 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.