సిద్దిపేట, జూలై 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానలు కురవక పోవడం, రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలక పోవడంతో సాగునీటికి సిద్దిపేట జిల్లా రైతులు తల్లడిల్లుతున్నారు. తొలకరి వర్షాలకు వేసిన విత్తనాలు ఎండిపోతుండడం, నారు మళ్లు ముదిరిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో సాగునీటిని విడుదల చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని, సాగు నీటి కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని రైతులు తెలిపారు. రిజర్వాయర్ల నుంచి చెరువులు నింపి పంటల సాగుకు సహకరించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూలై నెల సగం పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో భారీ వర్షాలు కురవక పోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనాలు వేస్తే అవి మట్టిలోనే వట్టిపోతున్నాయి. మరికొన్ని చోట్ల మొక్కలు ఎండి పోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు మునిగే ప్రమాదం నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేద్దామంటే నీళ్లు లేక వరి నార్లు ముదిరి పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో కాళేశ్వరం జలాలను చెరువులకు విడుదల చేయడంతో చెరువులు నిండుకుండలా ఉండే వి. వర్షాకాలం ప్రారంభం కాగానే కొద్దిపాటి వర్షానికి చెరువులు నిండిపోయేవి. దీంతో పుష్కలంగా సాగునీరు అందింది. ప్రస్తుతం వర్షాలు లేక.. ఇటు సాగునీరు రాక రైతులు దిగులు చెందుతున్నారు.
సిద్దిపేట జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వైపు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేస్తే తాము సాగు పనులు చేసుకోవచ్చని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయాలని రైతులు కోరుతున్నారు. సాగు నీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్ద్యం 3.5 టీఎంసీల సామర్ధ్యం కాగా, మూడు టీఎంసీలు నింపారు. ప్రస్తుతం ఇందులో 1.22 టీఎంసీలు, రంగనాయక సాగర్ రిజర్వాయర్ సామర్ధ్యం 3 టీఎంసీలు కాగా, 2.9 టీఎంసీలు నింపారు. ప్రస్తుత నీటి మట్టం 1.05 టీఎంసీలు, తొగుట మండలంలోని మల్లన్నసాగర రిజర్వాయర్ సామర్ధ్యం 50 టీఎంసీలు కాగా, యాసంగి సాగు సమయంలో 18.5 టీఎంసీల నీటిని నింపారు. ప్రస్తుతం 10 టీఎంసీలు ఉన్నాయి. మర్కూక్ మండలంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ సామర్ధ్యం 15 టీఎంసీలు కాగా, 10 టీఎంసీల నీటిని నింపగా, ప్రస్తుతం 4.96 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆయా రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసి, ఆ రిజర్వాయర్ల పరిధిలోని చెరువులు, కుంటలు నింపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గత వేసవిలో కాళేశ్వర జలాలను విడుదల చేయక పోవడంతో చెరువులు ఎండి పోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వర జలాలు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బీఆర్ఎస్ హయాంలో కాలంతో పనిలేకుండా కళకళలాడిన రిజర్వాయర్లు.నేడు నీళ్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడో పుట్టిన గోదావరి నీళ్లు ఇక్కడి తీసుకువచ్చి బీడు బారిన పొలాలకు పారించారు కేసీఆర్. రికార్డు స్థాయిలో రిజర్వాయర్లను, ప్రధాన కాల్వలను పూర్తి చేయించి ప్రతి చెరువు, వాగును, చెక్‌డ్యామ్‌ను నింపారు. దీంతో యాసంగి, వానకాలంలో రైతులు పుష్కలంగా పంటలు పండించారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. దీంతో రైతులు పరేషాన్లో ఉన్నారు.