సిద్దిపేట, నవంబర్ 14 : రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్లో వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులతో ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డెంగీ కేసులపై సమీక్షించారు. హెచ్ఐఎంఎస్ సేవలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు.
సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణి నమోదు దగ్గర నుంచి ప్రసవం అయ్యేంతవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిద్దిపేట డీఎంహెచ్వో డాక్టర్ సీహెచ్ ధనరాజ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వినోద్ బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ సుధీర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.