Coconut | నర్సాపూర్, నవంబర్ 6 : కొబ్బరికాయ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దేవాలయాలకు వెళ్లాలన్నా, ఇంట్లో దేవుడికి నమస్కరించుకోవాలన్నా కొబ్బరికాయ కొట్టడం ఖచ్చితమని తెలిసిందే. పూజా కార్యక్రమాలకు ఏది ఉన్నా… లేకున్నా… కొబ్బరికాయ మాత్రం కచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇక భక్తుల సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని కొబ్బరికాయ దుకాణదారులు విపరీతమైన రేట్లు పెంచేసి కొబ్బరికాయలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏ కిరాణ దుకాణంలో చూసినా కొబ్బరికాయలు 40 నుండి 50 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
కార్తీక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకుని హోల్ సేల్ దుకాణదారులు కొబ్బరికాయ ధరలు అమాంతం పెంచడంతో వాటిని కొన్న భక్తులకు జేబుకు చిల్లులు పడ్డాయి. కొబ్బరికాయలు కొన్న భక్తులు అంత ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని దుకాణదారులను ప్రశ్నిస్తే మాకు హోల్‌సేల్‌లో అమ్మేవారు అధిక రేట్లకు ఇస్తున్నారని సమాధానం చెబుతున్నారు. ఇది కూడా వాస్తవమే.. ఎందుకంటే హోల్ సేల్‌లో తక్కువ ధరకు లభిస్తే కిరాణా దుకాణాల్లో కూడా తక్కువ ధరకే ప్రజలకు అమ్మడం జరుగుతుంది.
కేవలం 28 రూపాయలకే..
ఈ మధ్యకాలంలో నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల కొబ్బరికాయల హోల్‌సేల్ దుకాణంలో ఒక కొబ్బరికాయ 35 నుండి 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కిరాణా దుకాణదారులు అక్కడినుండి కొబ్బరికాయలు తీసుకువచ్చి 40 నుండి 50 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇవే కొబ్బరికాయలు తూప్రాన్ పట్టణంలోని హోల్‌సేల్ దుకాణంలో కేవలం 28 రూపాయలకే లభించడం జరుగుతుంది. కానీ నర్సాపూర్‌లో మాత్రం అమాంతం ధరలు పెంచేసి భక్తులను, ప్రజలను నిలువునా ముంచుతున్నారు.
ఈ విషయంపై నర్సాపూర్ హోల్ సేల్ దుకాణదారుడిని అడగగా.. కొబ్బరి కాయలలో తేడాలు ఉంటాయని అడ్డగోలు సమాధానం చెబుతున్నాడు. ఇదే ప్రశ్న నెల రోజుల క్రితం అడగగా వర్షాల కారణంగా కొబ్బరికాయల రేట్లు పెరిగాయని సమాధానం ఇచ్చాడు. దేవునిపై ఉన్న సెంటిమెంట్‌తో ప్రజలు ఎలాగైనా, ఎంతైనా డబ్బులు పెట్టి కొబ్బరికాయలు కొంటారని వ్యాపారస్తులు నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఇక ప్రధాన ఆలయాల వద్దకు వెళ్లినప్పుడు కొబ్బరికాయలు కొందామంటే చుక్కలు కనబడుతున్నాయి. కిరాణం, హోటల్, మద్యం లాంటివే కాకుండా సంబంధిత అధికారులు ఇలాంటి దుకాణాలపైన కూడా నిఘా పెట్టి ప్రజలను మోసాల బారి నుండి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Crime news | భార్యపై అనుమానంతో ముక్కు కోసేసిన భర్త..!
Chevella | చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా.. 25 మందిపై కేసు నమోదు
Home Minister Anitha | ఏపీని గంజాయిని రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ ది: హోంమంత్రి అనిత