Crime news : భార్యపై అనుమానంతో భర్త ఆమె ముక్కు కోసేశాడు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం జబువా జిల్లా (Jhabua district) లోని రాణాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల పడల్వా (Padalwa) గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.
నిందితుడు రాకేశ్ బిల్వాల్ తన భార్య, కొడుకుతో కలిసి బతుకుదెరువు కోసం గుజరాత్‌కు వెళ్లాడు. అయితే అక్కడ అనుమానంతో నిత్యం భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె తాను ఈ వేధింపులు భరించలేనని, నమ్మకపోతే తనకు విడాకులు ఇవ్వాలని కోరింది. దాంతో స్వగ్రామానికి వెళ్లి పెద్దల సమక్షంలో మాట్లాడుదాం అని పడల్వాకు తీసుకొచ్చాడు.
ఇంట్లోకి రావడంతోనే కర్ర తీసుకుని ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా బ్లేడుతో ముక్కు కోశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. భయంతో తమ కొడుకు ఏడుస్తున్నా తన భర్త కొట్టడం ఆపలేదని బాధితురాలు తెలిపారు.