సిద్దిపేట, జూలై 10 : ఒకప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచిన సిద్దిపేటలో నేడు అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతున్నది. సిద్దిపేటలో అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన నిధులను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపివేయడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ సర్కారు సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధిపై శీతకన్ను వేయడంతో నిధులు విడుదల కాక చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే ఆపివేస్తున్నారు. సిద్దిపేట పట్టణంలో కోమటి చెరువు సమీపంలోని బైపాస్ రోడ్లో రూ. 25 కోట్లతో చేపట్టిన శిల్పారామం పనులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన విధంగా సిద్దిపేటలోనూ శిల్ప కలలకు విలయం గా శిల్పారామం నిర్మించాలనే లక్ష్యంతో ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రూ. 25 కోట్లు మంజూరు చేయించారు. శిల్పారామాన్ని నిర్మించడం ద్వారా కోమటి చెరువును గొప్ప పర్యాటక ప్రాం తంగా మార్చాలనే ఉద్దేశంతో 2023 ఏప్రిల్ 23న ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు 1500 మంది కూర్చునేలా ఆడిటోరియంతో పాటు ఫుడ్‌కోర్టు, ఫుడ్ స్టాల్, ఎలిఫెంట్ యూ టవర్, గజబౌల్స్, కాం పౌండ్ వాల్, ఆర్టిఫీషియల్ బీచ్‌తో పాటు మొత్తం 21 రకాల సౌకర్యాలతో ఈ నిర్మాణం చేపట్టేలా పనులు ప్రారంభించారు.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మిస్తున్న శిల్పారామం పనులకు నిధులు విడుదల శాపంగా మారింది. దీంతో పనులన్నీ బేస్మెంట్ లేలెవలోనే ఆగిపోయాయి. టూరిజం శాఖ అధికారులు చెబుతున్న లెకల ప్రకారం ఇప్పటి వరకు రూ .9 కోట్ల మేరకు పనులు జరిగాయని, బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను మధ్యలోనే ఆపివేశారు. దీంతో అకడికి వెళ్తే మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన పనుల్లో రూ.7.8 కోట్ల బిల్లుల విడుదలకు ప్రభుత్వానికి పంపగా, ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. మరో రూ. 2కోట్ల విలువగల పనులకు సంబంధించిన బిల్లులు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధి అడ్డుకోవడం తగదని, వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తిచేయాలని ప్రజల కోరుతున్నారు.