సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6: విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ప్రవేశ ద్వారం నుంచి ప్రాంగణంలోకి వెళ్లారు. దీంతో కలెక్టరేట్లోని ఏబ్లాక్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
విద్యార్థులు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన విద్యార్థులు అక్కడే బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజేశ్, కార్యదర్శి సతీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
పాఠశాలలు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఫీజు నియంత్రణ చట్టం లేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని మండిపడ్డారు. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు అర్జున్, లక్ష్మణ్, వాణి, రిషీ, సందీప్, బుచ్చిబాబు, వరుణ్, శ్రావణి, అభిషేక్, రాజు, రమేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.