మెదక్ మున్సిపాలిటీ/సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 8: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు త్వరలో టెండర్లు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. బుధవారం ప్రజాభవన్ నుంచి పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క, దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, విద్యుత్ శాఖ సీఎండీలతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్యయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధనతోపాటు ఆర్థికాభివృద్ధికి అవకాశాలు కల్పించాలన్నారు. నూతన విద్యు త్పాలసీ, ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య గతేడాది నవంబర్ 19న ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు.
ఐదేండ్ల లో కోటిమంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ క్రమంలో మహిళలకు పెద్దఎత్తున వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్న నేఫథ్యంలో వివిధ రకాల వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఈనెల 20వ తేదీ వరకు ప్రతి జిల్లాలో 150 ఎకరాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలన్నారు. ఒక మెగావాట్ ఉత్పత్తికి నాలుగు ఎకరాల భూమి అవసరం ఉం టుందన్నారు. ప్రతి జిల్లాలో 150 ఎకరాల భూమి అవసరం ఉంటుందన్నారు. దేవాదాయ, అటవీశాఖ, నీటిపారుదల శాఖ ల పరిధిలోని భూములను గుర్తించాలన్నారు.
ప్రతి నియోజకవర్గంలో స్మాల్, మైక్రో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 4 నుంచి 5 ఎకరాల భూమి అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రం లో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటి వరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా, ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరగడం లేదన్నారు. నర్సాపూర్‌లోని దేవస్థానానికి చెందిన వంద ఎకరాలు గుర్తించినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. జిల్లాలో 75 సబ్స్టేషన్లు ఉన్నాయని, సర్వే నంబర్ల వారీగా నివేదికలు అందజేసే విధంగా అధికారులకు సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా నుంచి కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీవో జ్యోతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.