గజ్వేల్, ఏప్రిల్ 27: ఉద్యమ పార్టీ (బీఆర్ఎస్)తోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని, ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు అండగా నిలబడిన ప్రజల బాగోగులను ఆలోచించి పదేండ్లలో మన్ననలు పొందేలా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పూరస్కరించుకొని సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన జెండావిష్కరణలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యమ అనంతరం కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి చేసిందన్నారు. తాగు, సాగునీటి గోస తీర్చిన కేసీఆర్ నేడు రైతులు, ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు.
సమైక్య పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న తెలంగాణ అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని వ్యవసాయానికి సాగునీరు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించి దేశంలోనే అందరి మన్ననలు పొందారన్నారు. రైతు బీమా, రైతు బంధు, కల్యాణలక్ష్మి, జిల్లాకో మెడికల్ కళాశాల, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో అద్భుతంగా రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. అద్భుతంగా సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం, దేశంలోనే ఎక్కడాలేని విధంగా అంబేద్కర్ విగ్రహం, దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు, బీసీ బంధు పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇవే కాకుండా అనేక పథకాలకు పురుడు పోశారని, నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మధు, నవాజ్‌మీరా, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.