హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): పీఎం కుసుమ్ పథకంలో భాగంగా తాము ఏర్పాటుచేసిన సోలార్ ప్లాంట్ల టారిఫ్‌ను తగ్గించొద్దని, టారిఫ్‌ను తగ్గించేలా డిస్కమ్‌లు చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)ని రైతులు కోరారు. ఈ ప్రాజెక్ట్‌లకు ప్రస్తుతం అమల్లో ఉన్న యూనిట్ ధర రూ.3.13 టారిఫ్‌ను రూ.2.98కు తగ్గించాలని కోరుతూ డిస్కమ్‌లు ఈఆర్సీకి పిటిషన్లు దాఖలు చేయగా, వీటిపై ఈఆర్సీ మంగళవారం హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించింది. దీనిపై 711 మంది రైతులు అభ్యంతరాలు దాఖలు చేశారు. పీపీఏ కుదర్చుకున్నప్పుడు ఉన్న టారిఫ్‌ను నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టామని, కమిషనింగ్ దశకు చేరిన తర్వాత తగ్గించడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన టారిఫ్‌ను నమ్మి భూములు అమ్మి, అప్పులు తెచ్చి ప్లాంట్లు ఏర్పాటుచేశామని వివరించారు. పెట్టుబడులు పెట్టిన తర్వాత టారిఫ్‌ను తగ్గించడంవల్ల నియంత్రణ వ్యవస్థపై విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకొని యూనిట్‌కు రూ.3.13 టారిఫ్ కొనసాగించాలని విజ్ఞప్తిచేశారు.
రైతుల వాదనలు
‘సోలార్ పరికరాలు, ప్లాంట్ల సామగ్రి జీఎస్టీ తగ్గింపును ఆధారంగా చేసుకొని టారిఫ్ తగ్గించాలనుకోవడం దారుణం. జీఎస్టీ తగ్గినా ప్రాజెక్ట్ వ్యయం తగ్గలేదు. కార్మికుల వేతనాలు, రవాణా, లాజిస్టిక్స్, బీమా, వడ్డీ, నిర్వహణ, భద్రత ఏర్పాట్లు, కంట్రోలింగ్ సిస్టమ్స్ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. విద్యుత్తు సరఫరా షెడ్యూల్, నాన్ షెడ్యూల్ షట్డౌన్లు, ఫీడర్ అంతరాయాలు, విద్యుత్తు తరలింపు సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ లోపాలు, లైన్ఫాల్ట్ తదితర కారణాలతో విద్యుత్తు ఉత్పత్తి తగ్గి ఆదాయానికి గండిపడుతున్నది. టారిఫ్ నిర్ణయించే విషయంలో జీఎస్టీ లెక్కలోకి తీసుకోవద్దు. రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి’అని రైతులు ఈఆర్సీ ఎదుట వాదించారు.