– విద్యుత్ సమస్యపై అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఆగ్రహం
పెన్పహాడ్, సెప్టెంబర్ 11 : పెన్పహాడ్ ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ సమావేశంలో విద్యుత్ సమస్యపై అధికార కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న హుజూర్ నగర్, కోదాడ నియోజకవవర్గంలో పూర్తిస్థాయిలో నాణ్యమైన 15 గంటల నిరంతర విద్యుత్ ఇచ్చి తమకేమో అరకోరా విద్యుత్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా విద్యుత్ లేక గ్రామాల రైతులు వచ్చి తమని ఇబ్బందులు గురి చేస్తున్నట్లు, వారిని ఎదుర్కోలేకపోతున్నామని అధికారులకు సర్పంచులు తెలిపారు.
వ్యవసాయానికి సరిపడా విద్యుత్తు సరఫరా కావడం లేదని, అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదని ఫలితంగా పంటలు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 6 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా కావడం లేదని సర్పంచులు పేర్కొన్నారు. సమస్యపై సంబంధిత విద్యుత్ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదన్నారు. మండల అధికారులు సైతం సర్పంచులు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, వ్యవసాయానికి మంత్రి ఉత్తమ్ నియోజకవవర్గంలో ఇచ్చిన మాదిరిగా తమకు నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయాలని సర్పంచులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సమావేశానికి హాజరు కానీ విద్యుత్ ఏఈ గ్రామాలలో తీవ్రమైన విద్యుత్ సమస్య ఉండగా సమావేశానికి ఎందుకు గైర్హాజరు అవుతారు అని ఎంపీడీఓను నిలదీశారు. దీంతో ఎంపీడీఓ ఏఈ శ్రీనివాస్ కు ఫోన్ చేయగా అక్కడికి వచ్చిన ఏఈ శ్రీనివాస్ ను సర్పంచులు నిలదీశారు. తమకు వ్యవసాయానికి, గృహాలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

మంత్రి ఇలాకాలో నాణ్యమైన విద్యుత్.. మాకేమో అరకోరా విద్యుతా?