సంగారెడ్డి, జనవరి 26(నమస్తే తెలంగాణ): కొన్నిరోజులుగా ఇంట్లోనే చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ(60) ఆదివారం సంగారెడ్డిలో కన్నుమూశారు. ఏ రంగంలో ఉన్నా ఆయన తనదైన ముద్రవేశారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంత గ్రామానికి చెందిన ఆర్.సత్యనారాయణ జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉమ్మడి మెద క్, ఆదిలాబాద్, కడప, కర్నూలు, హైదరాబాద్‌లో జర్నలిస్టుగా పనిచేసి పీడిత ప్రజల పక్షాన నిలిచారు. 2001లో బీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు.
బీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా పదవులు నిర్వహించారు. 2007లో కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి పోటీచేసి ఎమ్మెల్సీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2008లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2014లో కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీచేసిన సమయంలో ఆయనకు ఎన్నికల ఏజెంట్‌గా వ్యవహరించారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు సిద్దిపేటలో సీఎం రేవంత్‌రె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆయన అంత్యక్రియలు సంగారెడ్డి రాజంపేటలోని వైకుంఠధామంలో కుమారుడు నూతన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆయన మృతికి అధికార, ప్రతిపక్ష పార్టీలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, జర్నలిస్టు సంఘాల నేతలు, సామాజిక ఉద్యమకారులు సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆర్.సత్యనారాయణ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డిలు నివాళులర్పించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆర్.సత్యనారాయణ పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఎన్జీవో నేతలు కారం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్లు ఆర్.సత్యనారాయణకు నివాళులర్పించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు జైపాల్‌రెడ్డి, మఠం భిక్షపతి, ఆదర్శ్‌రెడ్డి, బాల్‌రెడ్డి, జిల్లా నాయకులు పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, మందుల వరలక్ష్మి తదితరులు నివాళులర్పించారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన వెంట బీజేపీ నాయకులు దేశ్‌పాండే, రవి ఉన్నారు. కాంగ్రెస్ నేతలు నీలం మధు, సీఎం చీఫ్ పీఆర్వో ఆయోధ్యరెడ్డి, జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకులు విరాహత్ అలీ, ఫైసల్, బండారు యాదగిరి, విష్ణు, పాత్రికేయులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సంగారెడ్డిలో ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యానిచ్చారు. ఆమె వెంట లావణ్యరెడ్డి, పట్లోరి రాజు ఉన్నారు.