సిద్దిపేట,డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామాల్లో నూతన పాలక వర్గం నేడు (సోమవారం) కొలువు దీరనుంది.ఆయా గ్రామాల్లో నూతన పాలక వర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు, మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు,4,220 వార్డులు,సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు, 5,558 వార్డులకు ఈనెలలో 11,14,17 తేదీల్లో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు,వార్డుసభ్యులు నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి నూతన సర్పంచ్‌లు,పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.కొత్తగా ఎన్నికైన పాలకవర్గాల చేత ప్రత్యేకాధికారులు పదవీ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇవ్వాళనే తొలి గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. గ్రామాభివృద్ధి చేపట్టాల్సిన వివిధ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక నేటితో ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది.గత పంచాయతీల పాలక వర్గం గడువు 2024 ఫిబ్రవరిలో పూర్తయ్యింది. మళ్లీ 22 నెలల తర్వాత నేడు పాలక వర్గాలు కొలువుతీరుతున్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలకు రానున్నాయి.
జిల్లాలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.నేడు ఆయా గ్రామాల్లో నూతన పాలక వర్గం కొలువుదీరనున్నది. 22 నెలల తర్వాత కొత్త పాలక వర్గం రావడంతో పాలన సర్పంచ్ల చేతిలోకి వెళ్లనున్నది. ఇన్నాళ్లు ప్రతేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాలు ఇక నూతన పాలక వర్గాల చేతిలోకి వెళ్తాయి.నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలుస్వాగతం పలుకుతున్నాయి. రెండేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నయా పైసా రాకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా గ్రామాల పరిస్థితి తయారైంది. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, చెత్త సేకరణ తదితర సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి. గ్రామాల్లో పని చేసే పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు లేవు.
నెలనెలా జీతాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పారిశుధ్య కార్మికులకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదు.గ్రామాల్లో పారిశుధ్యం బాగుండాలంటే వారికి సక్రమంగా జీతాలు ఇవ్వాలి కదా ..అలా ఇస్తేనే వారు పనులు సరిగా చేస్తారు.నెలల తరబడి జీతాలు లేక పోతే వారు ఎలా పనిచేస్తారు. వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారు ..? ఒక్క సారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. జీతాలు లేక గ్రామాల్లో పారిశుధ్యం పక్కదారి పట్టింది. ఎక్కడికక్కడ చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. మోరీల్లో చెత్త పేరుకుపోయింది.వీటన్నింటిపై నూతన పాలక వర్గాలు దృష్టి సారించాల్సి ఉంది.
ప్రత్యేకాధికారుల పాలనలో అన్ని తానై పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పనిచేశారు.నిధులు లేక పోయినా అప్పులు తీసుకువచ్చి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.వారు చేసిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు తమకు సహకరించి తాము పెట్టిన బిల్లులు ఇస్తారా.. లేదా..? అనే ఆందోళన వారిని వెంటాడుతుంది.పెండింగ్ బిల్లులు క్లీయర్ చేశాకనే ఇతర పనులకు వాటిని వినియోగించాల్సి ఉంటుంది.నేటి నుంచి పరిస్థితులు మరోలా ఉండనున్నాయి.
22 నెలలుగా గ్రామాల్లో పాలక వర్గాలు లేక కేంద్ర, రాష్ట్రం నిధులు నిలిచిపోయాయి.ఇప్పుడు గ్రామాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఒకే సారి రానున్నాయి.దీంతో గ్రామాలకు పెట్టిన ఖర్చులు తమకు ఇస్తారా..? లేదా..? అనే ఆందోళనలో కార్యదర్శులు ఉన్నారు. పంచాయతీ పోరులో కొందరు రాజకీయ అనుభవం ఉన్నవారు,గతంలో సర్పంచ్‌గా సేవలు అందించిన వారు గెలుపొందగా మరికొందరు నూతనంగా ఎన్నికై రాజకీయ అనుభవం లేని వారు ఉన్నారు.మరి కొని చోట్ల యువత గెలిపొందింది.వివిధ రంగాల్లో స్థిరపడ్డ వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.వీరంతా ఎన్నికల ప్రచారంతో ఎవరికి వారు సొంత మ్యానిఫెస్టోలు తయారు చేసుకొని ప్రజల ముందు ఉంచారు. తనను గెలిపిస్తే మ్యానిఫెస్ట్టోలో పెట్టినవి అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు. మరి ఇవ్వ న్నీ అమలు చేస్తారా..? వేచి చూడాలి.
కేసీఆర్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి కృషి చేసింది. ప్రతినెలా గ్రామలకు నిధులు కేటాయించింది. పల్లెప్రగతి ద్వారా నిధులను నేరుగా గ్రామా పంచాయతీలకు విడుదల చేసింది. ఇంటింటా చెత్త సేకరణకు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ అందించింది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలకు 494 ట్రాక్టర్లు,477 మంది పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు.మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీల్లో 469 ట్రాక్టర్లు, 468 పంచాయతీ సెక్రటరీలు, సంగారెడ్డి జిల్లాలో 647 (ప్రస్తుతం 620) గ్రామ పంచాయతీల్లో 636 ట్రాక్టర్లు ఉండగా అన్ని గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దబడ్డాయి. పలు గ్రామాలు జాతీయ స్థాయిలో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. పారిశుధ్యం లోపించింది. గ్రామాల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారింది. గ్రామ పంచాయతీలకు రెండేండ్లుగా నిధులు రావడం లేదు.గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నిధులు లేక ఇంటి పన్నుల ద్వారా వచ్చిన కొద్ది పాటి డబ్బులతోనే గ్రామాలను నెట్టుకొచ్చారు. గత పంచాయతీల పాలక వర్గం గడువు 2024 ఫిబ్రవరిలో పూర్తయ్యిది. గడువు ముగియగానే గ్రామాలకు ప్రత్యేకాధికారులను నియమించారు.వీరిని నియమించిన భారం అంతా పంచాయతీ కార్యదర్శుల మీదనే పడింది. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ లేదు. వాళ్లు కనీసం వారికి కేటాయించిన గ్రామాలకు తొంగి చూడడం లేదు. సరైన పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా గ్రామాలు తయారయ్యాయి.
“ గ్రామ సర్పంచ్/వార్డు సభ్యుడినైన(విజేత పేరు) అను నేను శాసనం ద్వారా ఏర్పాటైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుడి పేర/సత్యనిష్టతో ప్రమా ణం చేస్తున్నాను. అని ప్రమాణం చేయాలి. అనంతరం రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం వారు బాధ్యతలు చేపడుతారు”