Shivvam Peta | శివ్వంపేట, డిసెంబర్ 21 : శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో రాజకీయాలకు అతీతంగా మానవతా విలువలు వెలుగులోకి వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి, ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఆదర్శంగా నిలిచారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నీరుడి సుశీల–బాబు పోటీ చేశారు.
ప్రచార సమయంలో గ్రామంలోని చింతల బస్తి కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోరు వేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో విజయం దక్కకపోయినా, ఇచ్చిన మాటను మరిచిపోకుండా శనివారం రాత్రి కాలనీలో బోరు ఏర్పాటు చేయించారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజల అవసరాల పట్ల బాధ్యత వహిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం గ్రామస్థులను ఆకట్టుకుంది.
“పదవి కంటే మాటే ముఖ్యమని నిరూపించారు” అంటూ స్థానికులు అభ్యర్థిని ప్రశంసిస్తున్నారు. రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఈ మానవతా దృక్పథం యువతకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటమి ఎదురైనా ప్రజల పట్ల నిబద్ధతను చూపించిన ఈ ఘటన దొంతి గ్రామంలో మంచి మార్పుకు నిదర్శనంగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో నూతన వార్డు సభ్యులు మంగళ సుజాత రమేష్, బుద్ధుల మమతా బిక్షపతి, పిట్ల కృష్ణ, తుడుము రమేష్, కోదాసు స్వామి, మాజీ కో ఆప్షన్ సభ్యులు లాయక్, నీరుడి సుకుమార్, కాలనీ ప్రజలు ఉన్నారు.
Dharmaram | ధర్మారంలో ఘనంగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం
KCR | కాసేపట్లో కేసీఆర్ మీటింగ్.. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు
MLA Vijayaramana Rao | ఎమ్మెల్యే విజయరమణారావును సన్మానించిన పంచాయతీ పాలకవర్గం