మెదక్ జిల్లా జిల్లా నిజాంపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు కొమ్మాట ఇందిర ఆత్మహత్యాయత్నం చేసింది. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేట గ్రామ పంచాయతీలో కొమ్మాట ఇందిర గత 12 ఏళ్లుగా పారిశుధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తుంది. జీతం చెల్లింపు విషయంలో కొంతకాలంగా పంచాయతీ కార్యదర్శి నర్సింహులు ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మూడు నెలల నుంచి జీతం చెల్లించడం లేదు. దీంతో మనస్తాపం చెందిన ఇందిర.. శనివారం సాయంత్రం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఇందిర గడ్డిమందు తాగిన విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు నార్సింగి దవాఖానలో చికిత్స అందిస్తున్నారు.