జహీరాబాద్ , సెప్టెంబర్ 28 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేలా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థలు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎవ్వరికీ అవకాశం వచ్చినా అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించి చైతన్య పరచాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించు కోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హమీలతో గద్దెనెక్కిందని అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు వివరించాలన్నారు.14 ఏండ్లు పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమంగా పదేండ్ల పాలన సాగింది.
కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో అంతా తిర్లమర్లయ్యిందని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినపన్పటి నుంచి 20 నెలలుగా రాష్ట్రంలో మరణ మృదంగం మోగుతుందని అన్నారు. రోజుకో ఏదో ఒక చోట రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, గురుకుల పాఠశాలలో వివిధ రకాలుగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు మోసాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలని కోరారు.