Sangareddy | జహీరాబాద్, మార్చి 3 : సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడు నదిలో పడి మరణించాడు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆ యువకుడి మృతదేహం న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మంజీరా నదిలో లభ్యమైంది.
హత్నూరు పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నాగలిగిద్ద మండలంలోని కరస్ గుత్తి గ్రామ సమీపంలోని గంగారం తండాకు చెందిన చౌహాన్ సునీల్ (22) అనే యువకుడు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లాడు. రామంతాపూర్‌లో పానీపూరీ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల సునీల్ పచ్చకామెర్ల వ్యాధికి గురయ్యాడు. దీంతో వ్యాధిని తగ్గించుకునేందుకు పిట్లంలో ఆయుర్వేద మందును తీసుకునేందుకు ఫిబ్రవరి 28న రామంతపూర్ నుంచి గంఆరాం తండాకు పల్సర్ బైక్‌పై బయల్దేరాడు. స్వగ్రామానికి బయల్దేరిన సమయంలో రెండుమూడు సార్లు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడాడు. కానీ ఇంటికి మాత్రం చేరుకోలేదు. దీంతో కంగారు పడిపోయిన కుటుంబసభ్యులు సునీల్‌కు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఏమైపోయాడోనని కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు.
మరోవైపు హద్నూర్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రాఘవపూర్ సమీపంలోని మంజీరా నది వద్ద రోడ్డు పక్కన పల్సర్ బైక్ కనిపించింది. ఆన్లైన్లో బైక్ నంబర్‌ను పరిశీలించగా.. కరస్‌గుత్తి గంగారం తండాకు చెందిన సునీల్‌గా తేలింది. దీంతో పోలీసులు ఆదివారం నాడు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కుటుంబసభ్యులు.. బైక్‌ను పరిశీలించి అది తమ కుమారుడిదేనని గుర్తుపట్టారు. అలాగే కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం రాఘవపూర్ గ్రామ సమీపంలో మంజీరా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులకు సునీల్ మృతదేహం లభించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి అతని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ నెల 26వ తేదీన కుమారుడి వివాహం ఉందని.. అంతలోనే మృతి చెందాడని గుండెలవిసేలా రోదించారు. సునీల్ మృతిపై అతని కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరో హత్య చేసి నదిలో పడేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తమ కుమారుడిని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదని, ఎవరు ఎవరో హత్య చేసి నదిలో పడేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.