గుమ్మడిదల,జూలై15: గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో రేణుకా ఎల్లమ్మతల్లి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. మంగళవారం మున్సిపాలిటీ కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మున్సిపల్ నాయకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డితో పలు రాజకీయపార్టీల నాయకులు వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
సాయంత్రం గ్రామంలో యువకుల తొట్టెలతో పోతురాజుల విన్యాసాలు, డప్పుచప్పుల్లు, శివసత్తుల సిగాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారికి బోనాలతో వచ్చి భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.