పటాన్ చెరు, సెప్టెంబర్ 26 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరలో భారీ వర్షం కురవడంతో వాగులు, వరద కాలువలు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో నక్క వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఓఆర్ఆర్ ముత్తంగి ఎగ్జిట్ నుంచి ఇంద్రేశం వైపు వెళ్లే సర్వీస్ రోడ్డుపై నక్క వాగు ఉండడంతో నక్క వాగు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. పోలీసులు ముత్తంగి ఎగ్జిట్ వద్ద 65వ జాతీయ రహదారిపై సర్వీసు రోడ్డును మూసివేసి వాహనాలను పటాన్చెరు వైపు మళ్లించారు.
65వ జాతీయ రహదారి నుంచి పోచారం గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో వాహనాలను మళ్లించారు. ముత్తంగి నుంచి పోచారం, ఇంద్రేశం వైపు వెళ్లే సర్వీస్ రోడ్డును మూసివేసి పోలీసులు వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ఉదయం నుంచి రోడ్డుపైనే ఉండి భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
వరద నీటితో నక్క వాగు ప్రవహించడంతో అటువైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద నీటి కాలువలు కబ్జాలకు గురి కావడంతో వరద నీరు రోడ్లపై ప్రవహించి కాలనీలు జలమయమ వుతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వరదనీటి కాలువలు కబ్జాలకు గురైనయని ఆరోపణలు వస్తున్నాయి.