సంగారెడ్డి/మెదక్/ సిద్దిపేట, డిసెంబర్ 21: క్రైస్తవులు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఎప్పటిలాగే, ఈ ఏడాదీ పేద క్రైస్తవులకు కానుకలు అందిస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాలకు చేరిన గిఫ్ట్‌ప్యాక్‌లను అధికారులు భద్రపరిచారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ఆరు వేల మంది అర్హులకు వీటిని ఇవ్వనున్నారు. ఒక్కో ప్యాకెట్లో పురుషుల కోసం ప్యాంటు, షర్టు.. మహిళలకైతే చీర జాకెట్ ఉంటాయి. అలాగే, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్రైస్తవులకు ఇచ్చే విందు భోజనం కోసం నియోజకవర్గానికి రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నది. అర్హులను గుర్తించే బాధ్యత తహసీల్దార్లకు అప్పగించగా, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కానుకలు పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అన్ని వర్గాలు.. అందరి పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరలు, రంజాన్ పర్వదినానికి కిట్లు అందించినట్టే క్రైస్తవులు జరుపుకునే క్రిస్మస్ కోసం కానుకలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా సంక్షేమ పథకాలకు మాత్రం ఎటువంటి ఆటంకం కలుగకుండా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నట్లే ఈ సారి కూడా పండుగల వేళ పేదవారికి కానుకలు అందజేస్తున్నది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు మినహా మిగతా నాలుగు నియోజకవర్గాల్లో నాలుగు వేలమంది పేద క్రైస్తవులకు కానుకలు అందించనున్నది. అలాగే, విందు భోజనాల కోసం నియోజకవర్గానికి రూ. 2లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షల నిధులు మంజూరు చేయనున్నది. ఈ నెల 15న జిల్లా కేంద్రానికి ప్రత్యేక వాహనంలో నాలుగు వేల గిప్ట్ప్యాక్లు చేరుకున్నాయి. వీటిని స్థానిక దీన్దార్ ఫంక్షన్‌హాలులో భద్రపరిచారు. ఈనెల 17న అందోల్, జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రాలకు కానుకలను తరలించి తహసీల్దార్ కార్యాలయాలలో నిల్వ చేశారు. ఎమ్మెల్యేలు వీలును బట్టి క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
నాలుగు రకాలు వస్తువులు…
కుటుంబంలోని అందరూ పూర్తిగా కొత్తబట్టలతో క్రిస్మస్ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నాలుగు రకాల వస్తువులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌ను అందిస్తున్నది. ఇందులో పురుషుడికి ప్యాంటు, షర్టు, మహిళలకు చీర, జాకెట్ ఉంటాయి. గతంలో పండుగకు ముందు పేదవారికి విందుభోజనం ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేసేవారు. అయితే, కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో విందుభోజనాలకు ఆటంకం కలుగకుండా సామాజిక దూరం పాటిస్తూ పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతీ ఏడాది సీఎం కేసీఆర్ అందజేస్తున్న క్రిస్మస్ కానుకల పట్ల క్రైస్తవ మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్‌లో కొనసాగుతున్న పంపిణీ..
మెదక్ జిల్లాలో ఈ నెల 20 నుంచి దుస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. పంపిణీకి మైనార్టీ సంక్షేమ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి జిల్లాకు రెండు వేల జతల కానుకలు రాగా, పంపిణీకి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ సిద్ధమైంది.
రెండు వేల మంది అర్హులు
మెదక్ జిల్లాలో 5527 మంది క్రైస్తవులుండగా, వీరిలో రెండువేల మంది క్రైస్తవ పేదలకు దుస్తువులు పంపిణీ చేయను న్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి మంది చొ ప్పున రెండు నియోజక వర్గాల్లో రెండు వేల మందికి ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి సంబంధించిన గిఫ్ట్ ప్యాక్‌లను ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాలకు చేర్చారు. ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన కమిటీల ఆధ్వ ర్యంలో గిఫ్ట్‌లను ఇస్తారు. అలాగే, నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేస్తా రు. అదేవిధంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు కానుకలను అందజేయనున్నారు.
విందు భోజనాలకు రూ.8లక్షలు…
క్రిస్మస్ను ఘనంగా నిర్వహించేందుకు కానుకలతో పాటు విందు భోజనాలకూ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా విందు భోజనాల కోసం నియోజకవర్గానికి రూ. 2లక్షల చొప్పున 4 నియోజకవర్గాలకు రూ.8 లక్షలను కేటాయించనున్నది. సంబంధిత మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు క్రిస్మస్ కానుకలు, విందు భోజనాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
పాస్టర్లు, మత పెద్దల అభ్యర్థన మేరకు మరిన్ని..
సిద్దిపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కానుకలు వచ్చాయి. సిద్దిపేటలో క్రైస్తవ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. పాస్టర్లు, మత పెద్దల అభ్యర్థన మేరకు అదనంగా గజ్వేల్‌కు 2600, సిద్దిపేటకు 2 వేలు, దుబ్బాకకు 2 వేలు, హుస్నాబాద్‌కు 2 వేల క్రిస్మస్ కానుకలు ప్రభుత్వం అందజేసింది. ఇప్పటికే సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేయగా, ఆయా నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయనున్నారు.
జిల్లాకు చేరిన నాలుగు వేల కానుకలు…
ప్రతీ ఏడాది జిల్లాలోని క్రైస్తవ మైనార్టీలకు ప్రభుత్వం కానుకలు అందిస్తున్నది. ఈ సారి కూడా జిల్లాకు నాలుగు వేల గిప్ట్ప్యాక్లు వచ్చాయి. వీటిని నియోజకవర్గ కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలకు చేరవేశాం. తహసీల్దార్లు గుర్తించిన పేదవారికి పంపిణీ చేస్తాం. జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు నాలుగు వేల కానుకలు వచ్చాయి. పటాన్చెరు నియోజకవర్గం గ్రేటర్ పరిధిలో ఉన్నందున అక్కడే పంపిణీ చేస్తారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని గిఫ్ట్‌ప్యాక్‌లు పంపిణీ, విందు భోజనం ఏర్పాటు చేస్తాం.
కానుకలు ఇవ్వడం సంతోషకరం…
క్రిస్టియన్ పేదలకు కానుకలు ఇవ్వడం సంతోషకరం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఏడాది కానుకలతో పాటు విందు భోజనాలు పెట్టారు. ఈసారి కరోనా కారణంగా విందుకు దూరంగా ఉంటూ కరోనా నిబంధనలు పాటిస్తూ గిప్ట్ తీసుకుని అందరూ సంతోషంగా పండుగా జరుపుకోవాలి. కుటుంబ సభ్యులు సర్కార్ కానుకలను తప్పకుండా తీసుకోవాలి.
పండుగలను గుర్తించడం గొప్పవిషయం..
సర్కార్ అన్ని మతాలకు చెందిన పండుగలను గుర్తించడం గొప్పవిషయం. ఇంటిల్లిపాది సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకొనే విధంగా ప్రశాంత వాతావరణం కల్పించడం ఆనందకరం. చర్చిల వారీగా గుర్తించిన పేదలకు గిప్ట్ప్యాక్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం మంచిపని. క్రైస్తవ భక్తులు ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమానికి మద్దతు తెలిపి ఆశీస్సులు అందించాలి.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
క్రిస్మస్ కానుకల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో రెండువేల క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్నాం. వాటిని పాస్టర్ల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సరఫరా చేసి పంచేలా చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఎమ్మెల్యేల సమక్షంలో గిఫ్ట్‌ప్యాక్‌లను పంపిణీ చేస్తాం.