జహీరాబాద్, మే 3 : అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఆర్డీవో రాంరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హుస్సేల్లి గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్ధు ప్రాంతంలోని చెక్‌పోస్టును ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రాంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కర్ణాటకకు ఇసుక తరలిస్తున్న లారీలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. సరిహద్దు చెక్‌పోస్టు వద్ద రెవెన్యూ, పోలీసుల సహకారంతో 24 గంటల పాటు తనిఖీలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ అనుమతితో లారీల్లో ఇసుక తీసుకెళ్తున్నారా..? లేక ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారా అనేది క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇసుక తరలించే వాహనాల డ్రైవర్లు తప్పనిసరిగా వే బిల్‌తో పాటు అన్ని అనుమతులకు సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. అలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలించే లారీలను పట్టుకుని సీజ్ కేసి కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టు వద్దనే పట్టుకున్న ఇసుకను డంపింగ్ చేయాలన్నారు. ప్రతి రోజు మండలంలోని పలు ప్రాంతాల మీదుగా కర్ణాటక తదితర ప్రాంతాలకు ఇసుక లోడ్‌తో వెళ్లే వాహనాలను తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.