ఝరాసంగం : ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంచుకుని, చట్టాలను గౌరవించాలని సీనియర్ సివిల్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ సూరి కృష్ణ సూచించారు. శనివారం ఝరాసంగం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్భా బాలికల విద్యాలయంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. పలు చట్టాలపై అవగాహన కల్పించి, సూచనలు చేశారు.
న్యాయమూర్తి, న్యాయవాదులు మాట్లాడుతూ.. విద్యార్థులు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చట్టాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. బాలబాలికలపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కఠినమైన శిక్ష తప్పదని వేధింపుల విషయంలో సుప్రీంకోర్టు నుంచి జిల్లాస్థాయి వరకు కఠినమైన శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. మీరు ఏదైన సమాచారం గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.
విద్యార్థులు సోషల్ మీడియా, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాలల్లో సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవధికార సంస్థకు సంబంధించిన పారాలీగల్ వాలంటీర్లకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ గోపాల్, వైస్ ప్రెసిడెంట్ మాణిక్ పటేల్, సీనియర్ న్యాయవాది పాండురంగారెడ్డి, న్యాయవాదులు రుద్రయ్య స్వామి, సయ్యద్ షకీల్, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.