పటాన్చెరు, ఫిబ్రవరి 13: దళితబంధు పథకం సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం బచ్చుగూడెం గ్రామంలో దళితబంధు పథకంకు ఎంపికైన లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఆయన గ్రామంలో ఎంపీడీవో బన్సీలాల్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారు ఎంపిక చేసుకున్న యూనిట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. యూనిట్లపై వారికున్న అవగాహనను పరిశీలించారు. అవసరమున్న వారికి నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కూడా ఇచ్చేందుకు సిద్ధమని వీరారెడ్డి లబ్ధిదారులతో అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళితబంధు ద్వారా దళితులకు స్వయం ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నదన్నారు. ఎంపికైన లబ్ధిదారులు తమకు వచ్చిన రూ. 10లక్షలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యం దానిలో ఉందన్నారు. ప్రతి యూనిట్ విజయవంతమవుతేనే ప్రభుత్వం కల నిజమవుతుందన్నారు. దళితబంధు లబ్ధిదారులకు ఏ రకమైన సాయం కావాలన్నా అధికారులు అందజేస్తారని హామీ ఇచ్చారు. ఎంపీడీవో బన్సీలాల్ మాట్లాడుతూ బచ్చుగూడెంలో 39మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. వారిలో అధికశాతం పాల డైరీ లు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. దాని తరువాత ట్రాక్ట ర్లు, టాక్సీ కార్లు, డోజర్లను కొనుగోలు చేసేందుకు దరఖాస్తులు ఇచ్చారన్నారు. అందరికీ అవగాహన కల్పించి ప్రతి యూనిట్ విజయవంతమయ్యేలా చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంవీఐ రజామహమ్మద్, ఉపేందర్, వెటర్నరీ డాక్టర్, ఎంపీవో మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శులు రిజ్వాన్, అంబిక, వెంకటసుబ్బయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.
లబ్ధిదారులకు అవగాహన
దళిత బంధులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయి అధికారులు గోటిగార్పల్లి ఎస్సీ కాలనీలో పర్యటించి సమాచారం సేకరించారు. ఆదివారం గోటిగార్పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య, డీపీవో సురేశ్‌మోహన్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి బాబూరావు, ఆర్డీవో రమేశ్‌బాబుతో పాటు జహీరాబాద్ ఎంపీడీవో సుమతి, ఏపీడీ జయదేవ్ పర్యటించారు. పంచాయతీ కార్యదర్శులతో కలిసి దళిత బంధు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి యూనిట్ల ఎంపిక పై అవగాహన కల్పించారు. యూనిట్ల నిర్వహణకు అవసరమైన శిక్షణ ప్రభుత్వం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామ సర్పంచ్ పెంటప్ప ఉన్నారు.
అనంతారంలో ‘దళితబంధు’ఇంటింటి సర్వే
గుమ్మడిదల, ఫిబ్రవరి13: మండలంలోని అనంతారం గ్రామం లో ‘దళితబంధు’ లబ్ధిదారుల ఎంపిక కోసం ఇంటింటి సర్వే చేపట్టారు. ఆర్డీవో మెంచు నగేశ్, డీసీవో ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్ పర్యవేక్షణలో అధికారులు సర్వే చేట్టారు. గ్రామంలో 33 మంది దళిత కుటుంబాలను సర్వే చేశారు. దళితబంధు ద్వారా ఏవిధంగా ఉపాధి పొందనున్నారో తెలుసుకున్నారు. జిల్లా అధికారులకు నివేదికను అందించనున్నట్లు వారు తెలిపారు. వీరితో పాటు సర్పంచ్ దీపానరేందర్రెడ్డి ఉన్నారు.
బుడ్డాయిపల్లిలో
బుడ్డయిపల్లిలో పంచాయితీ కార్యద ర్శి ప్రవీణ్ కుమార్ సర్వే నిర్వహించారు. దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని, లాభదాయకమైన యూనిట్‌ను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మారావు, ఎంపీటీసీ నవీన సదానందం మైనార్టీ అధ్యక్షుడు షాబొద్దీన్, నాయకులు పాల్గొన్నారు.