జహీరాబాద్, ఫిబ్రవరి 6 : రైతులను సంఘటితం చేయడం, ప్రభుత్వ పథకాలు, నూతన సాగు విధానాలు, మార్కెటింగ్ గురించి తెలియజేసేందుకు ప్రభుత్వం రైతు వేదికలను అన్ని వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతువేదిక ఆదర్శంగా నిలుస్తున్నది. చదువుకున్న యువ రైతులు కొత్త పద్ధతుల్లో పంటలు సాగు చేసేందుకు రైతు వేదికలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యువ రైతులు సమయం దొరికినప్పుడు రైతువేదికలో ఉన్న పుస్తకాలను చదువుతారు. రైతు వేదిక ఆవరణలో సేంద్రియ ఎరువులతో ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఔషధ మొక్కలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతు వేదిక చుట్టూ పూల మొక్కలు నాటారు. జహీరాబాద్ క్లస్టర్లో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్ రైతు వేదికను ఒక గ్రంథాలయంగా ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
రంజోల్ రైతు వేదికలో ఔషధ మొక్కల పెంపకం…
రంజోల్ రైతు వేదికలో ఏఈవో ప్రదీప్ కుమార్ ఔషధ మొక్కలను పెంచుతున్నారు. అశ్వగంధ, శతావరి, సుగంధి పాల, రణపాల, నేలవేము, నల్లేరు, స్టివియా, మల్టీవిటమిన్ (చక్రముని), సరస్వతీ, కృష్ణ తులసి, లక్ష్మీతులసి, రుద్రజడ (సబ్జ్జా), ఉత్తరేణి, అపరాజిత (శంకుపుష్టి), పోడపత్తి, నేల ఉసిరి, తిప్పతీగ, బిల్లగన్నేరు, ఈశ్వరి, పారిజాతం, అలవిరి (కలబంధ) బృంగరాజ్ మొక్కలను పెంచుతున్నారు.
యువ రైతులకు నూతన పద్ధతులపై అవగాహన…
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విధానాలు, ఆధునిక సాగు విధానాలపై రైతులకు రైతు వేదికలో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు రైతు వేదికలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో సేంద్రియ ఎరువులతో పంటల సాగు, పంట మార్పిడి విధానం, రసాయన ఎరువుల వినియోగంతో దుష్పరిణామాలు, బిందుసేద్యం సాగు, ఉద్యాన పంటల సాగుతో లాభాలు వివరిస్తున్నారు. రైతు సంక్షేమ పథకాల గురించి రైతులకు వివరించి ప్రోత్సహిస్తున్నారు.
రైతుల సహకారంతో గ్రంథాలయం ఏర్పాటు
ప్రభుత్వం జహీరాబాద్ క్లస్టర్ పరిధిలోని రంజోల్‌లో రైతు వేదికను ఏర్పాటు చేసింది. రైతులకు నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు వ్యవసాయ పుస్తకాలు కొనుగోలు చేసి, రైతు వేదికలో మినీ గ్రంథాలయం ఏర్పాటు చేశాం. పుస్తకాలు చదువుకునేందుకు యువ రైతులు ఆసక్తి చూపుతున్నారు. సేంద్రియ ఎరువులతో ఔషధ, పూలమొక్కలు పెంచుతున్నాం. రైతు వేదికను వ్యవసాయ పరిశోధనా కేంద్రంగా తయారు చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు, రైతుల ప్రోత్సాహంతో ప్రయత్నం చేస్తున్నా. యువ రైతులకు పాతకాలం మొక్కలపై అవగాహన కలిపిస్తున్నా.
-ప్రదీప్‌కుమార్, ఏఈవో జహీరాబాద్