సంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో కరోనా నియంత్రణలోకి వస్తున్నదని, కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మే నెలలో కరోనా పాజిటివ్ రేటు 15 శాతం ఉండగా, ప్రస్తుతం 4.81 శాతానికి తగ్గినట్లు చెప్పారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో 1904 కరోనా పరీక్షలు చేయగా, 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, పాజిటివ్ రేటు కేవలం 3.9 శాతం ఉన్నట్లు వివరించారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయటం, ఇంటింటా ఆరోగ్య సర్వేతో కరోనాను కట్టడి చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు చెప్పారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, పటాన్చెరు, జోగిపేట పట్టణ ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మునిపల్లి, అందోలు మరికొన్ని మండలాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ రేటు 10 శాతం కంటే ఎక్కువ నమోదైతే ఆయా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయడంతో పాటు మూడో దశ ఇంటింటా ఆరోగ్య సర్వే చేపట్టాలని డీఎంహెచ్‌వో గాయత్రీదేవికి సూచించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
త్వరలో వారికి ఉచితంగా టీకాలు…
జిల్లాలో త్వరలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సైతం ఉచితంగా వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. థర్డ్ వేవ్ వచ్చిన పక్షంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో వెంటనే ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షిషాను ఆదేశించారు. జహీరాబాద్, సదాశివపేట, నారాయణఖేడ్ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లను త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. బొల్లారంలో పిల్లల కోసం 50 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కరోనా కేసులు తక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు.
జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రతిరైతు నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని, జొన్నలు దళారుల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డిని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో రైతులకు మేలు చేసేలా త్వరలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 161 జాతీయ రహదారి పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేసేలా 250 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి మునిపల్లి మండలంలో అనువైన ప్రభుత్వ భూములను గుర్తించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డికి సూచించారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం సేకరణ పూర్తి చేయాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. జిల్లాలో 99 శాతం ధాన్యం సేకరణ పూర్తయినట్లు అదనపు కలెక్టర్ వీరారెడ్డి తెలిపారు. రాబోయే 10 రోజుల్లో మిగతా ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. సమీక్షా సమావేశంలో ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, డీఎంహెచ్‌వో గాయత్రీదేవి, డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, కొవిడ్ ప్రత్యేక అధికారి రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
12న సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే ప్రారంభం
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ జిల్లాకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఈనెల 12న ప్రారంభించనున్నట్లు చెప్పారు. సర్వే పనుల కోసం ప్రభుత్వం రూ.16 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రెండు నెలల్లో సర్వే పనులు పూర్తి కానున్నట్లు చెప్పారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను త్వరలో బోరంచ వద్ద ప్రారంభిస్తామని తెలిపారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనుల కోసం ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు వివరించారు.
మెరుగైన వైద్యం అందించాలి…
ప్రభుత్వ దవాఖానల్లో కరోనా చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. దవాఖాన సూపరింటెండెంట్లు క్రమం తప్పకుండా కొవిడ్ వార్డులను సందర్శించి రోగులతో ఆత్మీయంగా మాట్లాడాలన్నారు. కొవిడ్ రోగులకు నిత్యం రూ.250తో పౌష్టికాహారం అందించాలన్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని వైద్య అధికారులకు మంత్రి ఆదేశించారు. జిల్లాలో 28వేల ఆత్యవసర సహాయకులు ఉంటే, వారిలో ఇప్పటి వరకు 12వేల మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. త్వరలోనే మిగతా వారికి వ్యాక్సిన్ వేస్తామన్నారు.
సంగారెడ్డిలో రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీ
సంగారెడ్డి ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్ కాలేజీ ఏర్పాటును సీఎం కేసీఆర్ నెరవేర్చినట్లు తెలిపారు. సంగారెడ్డిలో రూ.550 కోట్లతో త్వరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం జిల్లా కేంద్ర దవాఖాన ఆవరణలో 36 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని, ఇక్కడే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 150 సీట్లతో మెడికల్ కాలేజీ, 100 సీట్లతో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా రూ.260 కోట్లతో సంగారెడ్డిలో కొత్తగా 650 పడకల దవాఖాన నిర్మిస్తామన్నారు. రూ.200 కోట్లతో మెడికల్ కాలేజీ, హాస్టల్ భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. మరో రూ.40 కోట్లతో లైబ్రరీ ఇతర భవనాలను నిర్మిస్తామని చెప్పారు. మెడికల్ కాలేజీ నిర్వహణ కోసం ప్రభుత్వం 1200 పోస్టులు, నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు 108 పోస్టులను మంజూరు చేసినట్లు తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై కలెక్టర్ హన్మంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డితో మంత్రి చర్చించారు. ప్రభుత్వ దవాఖాన పక్కన అందుబాటులో ఉన్న 36 ఎకరాల స్థలంతో పాటు పోలీసు శాఖ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.