డెయిరీ యూనిట్ ఒకరు, పౌల్ట్రీ మరొకరు.. రవాణా వాహనాలు కొందరు, క్లాత్ ఎంపోరియం, కిరాణా, మెడికల్ షాప్‌లు మరికొందరు.. సెంట్రింగ్ షాప్, టెంట్‌హౌస్‌లు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో యూనిట్.. నచ్చిన రంగంలో..అనుభవం ఉన్న యూనిట్ ఏర్పాటు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. దళితబంధు కింద సీఎం కేసీఆర్ రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడంతో లబ్ధిదారులు ఆర్థికాభ్యున్నతికి అడుగులు వేస్తున్నారు. దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్నది. ఈ రెండు జిల్లాల్లో యూనిట్ల గ్రౌండింగ్ ప్రారంభం కాగా, నెలాఖరు నాటికీ వందశాతం పూర్తిచేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. ఈ పథకంతో తమ బతుకులు మారుతుండడంతో లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సంగారెడ్డి,(నమస్తే తెలంగాణ)/మెదక్, ఏప్రిల్ 13 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన దళితబంధు పథకం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్నది. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలను పభుత్వం గ్రౌంట్గా అందజేస్తోంది. ఈ డబ్బులతో లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ పథకంలో వ్యాపారం ప్రారంభించి నష్టపోకుండా ఉండేందుకు దళితరక్షణ నిధిని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దళితబందు పథకం కింద ఎక్కువ మంది లబ్ధిదారులు డెయిరీ, పౌల్ట్రీ, రవాణా వాహనాలు, క్లాత్ ఎంపోరియం, కిరాణా, మెడికల్ షాప్‌లు, యూనిట్లు ఏర్పాటుకు మొగ్గుచూపారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో తొలి విడతగా 100 మంది చొప్పున 400 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అందోలు నియోజకవర్గం సంగారెడ్డి, మెదక్ రెండు జిల్లాల పరిధిలో ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే అందోలు నియోజకవర్గంలోని మండలాలకు 44 దళితబంధు యూనిట్లను కేటాయించారు. మొత్తం సంగారెడ్డి జిల్లాలో 444 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మార్చి మొదటి వారం నుంచి జిల్లాలో దళితబంధు పథకం గ్రౌండింగ్ ప్రారంభమైంది. పటాన్చెరు నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు లబ్ధిదారులకు స్వయంగా వాహనాలు అందజేశారు. జిల్లాలో మొత్తం 444 దళితబంధు యూనిట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 402 యూనిట్లను గ్రౌండింగ్ చేశారు. 95 శాతం మేరకు గ్రౌండింగ్ పూర్తయ్యింది. నెలాఖరు వరకు వందశాతం పూర్తి కానుంది.
నియోజకవర్గాల వారీగా…
జహీరాబాద్ నియోజకవర్గంలోని గొడిగార్పల్లిలో 100లో 84 యూనిట్లు గ్రౌండింగ్ గొటిగార్పల్లికి చెందిన 45 మంది లబ్ధిదారులు మినీ డెయిరీలు ఏర్పాటు చేసుకోగా, 22 మంది రవాణా వాహనాలను కొనుగోలు చేశారు. ఎనిమిది మంది లబ్ధిదారులు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. ఒకరు ఆటో కొనుగోలు చేయగా, మరో ఇద్దరు సెంట్రింగ్ షాపు పెట్టుకున్నారు. మరికొంత మంది క్లాత్ ఎంపోరియం, వెల్డింగ్షాపును ఏర్పాటు చేసుకున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ఉత్తర్పల్లి, గొల్లగూడెం, బేగంపేట గ్రామాల్లో వందమంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పటి వరకు 72 దళితబంధు యూనిట్లను గ్రౌండింగ్ పూర్తి చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 40 మంది లబ్ధిదారులు మినీ డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసుకోగా, 13 మంది రవాణా వాహనాలను కొనుగోలు చేశారు. అలాగే ఐదుగురు ట్రాక్టర్లను కొనుగోలు చేయగా మరో ఐదుగురు పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేసుకున్నారు. తొమ్మిది మంది లబ్ధిదారులు పందిరి కూరగాయల సాగు యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మహాదేవ్పల్లి గ్రామంలో దళితబంధు పథకం కింద వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 100మంది లబ్ధిదారులకుగాను 87 మంది లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయ్యింది. మహదేవ్‌పల్లికి చెందిన దళితబంధు లబ్ధిదారుల్లో అత్యధికంగా 31 మంది మినీ డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసుకోగా, 27 మంది రవాణా వాహనాలను కొనుగోలు చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అనంతారం, కొడకండి, బచ్చుగూడెం గ్రామాల్లో వంద మంది దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో ఇప్పట వరకు 90 యూనిట్లను గ్రౌండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో సైతం అత్యధికంగా 33 మంది మినీ డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. అందోలు నియోజకవర్గంలోని బుడ్డాయిపల్లి గ్రామంలో 44 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. బుడ్డాయిపల్లిలో దళితబంధు పథకం 44 యూనిట్లును గ్రౌండింగ్ పూర్తి చేశారు. బుడ్డాయిపల్లికి చెందిన 18 మంది లబ్ధిదారులు మినీ డెయిరీ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో దళితబంధు పథకం అమలు స్పీడ్ అందుకున్నది. జిల్లాలో మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా ఉండగా, గజ్వేల్, అందోల్, దుబ్బాక, నారాయణఖేడ్ నియోజకవర్గాలు పాక్షికంగా వస్తాయి. వీటి పరిధిలో తొలి విడతలో మొత్తం 256 మందికి లబ్ధిదారులను ఎంపిక చేశారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆందోల్ నియోజకవర్గంలోని హసన్మహ్మద్పల్లిలో 56 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. మొదటి విడతలో మెదక్ నియోజకవర్గంలోని హవేళీఘనపూర్ మండలం జక్కన్నపేటలో 20 మంది లబ్ధిదారులు, మెదక్ మండలంలో కొంటూర్లో 20 మంది, నిజాంపేట మండలం రాంపూర్‌లో 18 మంది, పాపన్నపేట మండలం అబ్లాపూర్లో 18 మంది, రామాయంపేట మండలం శివ్వాయిపల్లిలో 7 మంది, చిన్నశంకరంపేట మండలం చందంపేటలో 17 మంది మొత్తం 100 మంది, నర్సాపూర్ నియోజకవర్గంలో కౌడిపల్లి మండలం వెంకటాపూర్-బీలో 34 మంది, చిలిపిచెడ్ మండలం రాందాస్‌గూడలో ఇద్దరు, నర్సాపూర్ మండలం తిర్మలాపూర్‌లో 21 మంది, శివ్వంపేట మండలం తిమ్మాపూర్‌లో 18 మంది, వెల్దుర్తి మండలం రామంతాపూర్‌లో 23 మంది, బండమీదిపల్లిలో ఇద్దరు, ఆందోల్ నియోజకవర్గంలోని హసన్మహ్మద్పల్లిలో 56 మంది మొత్తం 256 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలో దళితబంధు పథం కింద 256 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, ఇందులో 219 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 175 మందికి రూ.7.12 కోట్లు వారి డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. 256 మందికి గాను 175 మందికి యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి.
175 మంది లబ్ధిదారులకు గ్రౌండింగ్…
మెదక్ జిల్లాలో దళితబంధు పథకం కింద 256 మంది లబ్ధిదారులను తొలి విడతగా ఎంపిక చేశాం. జిల్లాలో 1,31,474 మంది జనాభా ఉండగా, 2014 ఎస్కేఎస్ ప్రకారం 39,590 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 175 మంది లబ్ధిదారులకు రూ.7.12 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయి.
– విజయలక్ష్మి, జిల్లా ఇన్చార్జి ఎస్సీ సంక్షేమ అభివృద్ధి అధికారి, మెదక్
వందశాతం పూర్తి చేస్తాం..
సంగారెడ్డి జిల్లాకు దళితబంధు పథకం కింద తొలి విడతలో కేటాయించిన 444 యూనిట్లను నెలాఖరు వరకు వందశాతం గ్రౌండింగ్ చేస్తాం. జిల్లాలో 444 యూనిట్లకు గాను 402 యూనిట్లను గ్రౌండింగ్ చేశాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 1500 దళితబంధు యూనిట్లు కేటాయించారు. కొత్త యూనిట్లు కూడా నిర్ణీత సమయంలో గ్రౌండింగ్ చేస్తాం.
-బాబూరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, సంగారెడ్డి