Sangareddy | హత్నూర, ఏప్రిల్08 : తారురోడ్డుపై కంకరతేలి పెద్ద పెద్ద గుంతలు పడటంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కంకర తేలిన రోడ్డుపై ప్రయాణం సాగించాలంటే నరకయాతన పడాల్సివస్తుందని పలుగ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గుంతలరోడ్డుపై ప్రయాణం సాగిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడిపోవడంతోపాటు వాహనాలు చెడిపోతున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చింతల్చెరు నుంచి కొత్తగూడెం గ్రామాన్ని కలుపుతూ నాగారం చౌరస్తావరకు గల తారురోడ్డు పూర్తిగా ధ్వంసం అవడంతోపాటు పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. దీంతో ఆ రోడ్డుగుండా వెళ్లడానికి సమీప గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా రెయిన్లగూడ నుంచి కొడిపాక గ్రామశివారు వరకుగల తారురోడ్డు పూర్తిగా చెడిపోయి కంకరతేలి గుంతలు పడ్డాయి. దీంతో వాహనచోదకులు ఆ రోడ్డుగుండా వెళ్లడానికి జంకుతున్నారు. ధ్వంసమైన తారురోడ్లకు మరమ్మత్తులు చేసి ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు తీర్చాలని పలు గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.