గుమ్మడిదల మార్చి 21: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లబెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు (Dumping Yard) ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. డంపింగ్ యార్డ్ ఏర్పాటుచేయడానికి రామ్కీ సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ.. జేఏసీ నాయకులు గుమ్మడిదల మండలంలోని 13 గ్రామాల్లో ప్రజా బ్యాలెట్ ఓటింగ్ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ ప్రజా బ్యాలెట్ తీర్పును రాష్ట్ర అధికారులకు, సంబంధిత శాఖల అధికారులకు సమర్పిస్తామని నాయకులు వెల్లడించారు.
కాగా, ప్యారానగర్, నల్లివల్లి, కొత్తపల్లి గ్రామాలు మరో లగచర్లను తలపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలంటూ ప్రజలు చేస్తున్న పోరాటం ఉధృతమవుతున్నది. ప్రజలు అభ్యంతరం తెలుపుతున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిర్బంధాలు, ఆంక్షలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో పోలీసుల బలగాలు మోహరించాయి. డంపింగ్ యార్డ్ కోసం ఫిబ్రవరిలో వందల ట్రక్కులు, బుల్డోజర్లతో జీహెచ్ఎంసీ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నల్లవల్లి, మంభాపూర్, కొత్తపల్లి, ప్యారానగర్, గుమ్మడిదల, బొంతపల్లి, దోమడుగు గ్రామాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతం ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించింది.
జంటనగరాల నుంచి రోజూ 200 నుంచి 300 ట్రక్కుల్లో చెత్తను ప్యారానగర్ డంప్‌యార్డుకు తరలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇదే జరిగితే హైదరాబాద్-గుమ్మడిదల రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయని, దుర్గంధం వ్యాపించి ప్రజలు ఇబ్బందిపడతారని 10 గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికే బొంతపల్లి, దోమడుగు, మంబాపూర్, అనంతారం పరిధిలోని రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో గుమ్మడిదల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డంప్‌యార్డు కూడా ఏర్పాటు చేస్తే అక్కడ నివసించే పరిస్థితులు ఉండవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.