మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్12: సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు చెరువులు, చెక్‌డ్యామ్‌లు, కుంటలు మత్తడిదుంకుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ధూళిమిట్ట, లింగాపూర్, తోర్నాల, జాలపల్లి చెక్‌డ్యామ్‌లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన గాగిళ్లాపూర్ పెద్ద చెరువు మత్తడిపోస్తున్నది. మద్దూరు, ధూళిమిట్ట వాగులు పారుతున్నాయి. జిల్లాలోనే ధూళిమిట్ట మండలంలో అత్యధికంగా 164.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మద్దూరు మండలం లో 90.3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాగిళ్లాపూర్-నర్సాయపల్లి, ధూళిమిట్ట-బైరాన్‌పల్లి, జాలపల్లి-ఖాతా, కూటిగల్- సోలిపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షానికి పత్తి, మొక్కజొన్న చేన్లల్లో నీరు చేరింది. వరి పంటలో ఇసుక మేటలు వేశాయి.
హుస్నాబాద్, సెప్టెంబర్ 12: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు ఎట్టకేలకు వరుణుడు ఊరట కలిగించాడు. అంతటా వర్షాలు పడి హుస్నాబాద్ డివిజన్లో వర్షాలు లేక చెరువులు వెలవెలబోతున్న తరుణంలో గురువారం రాత్రి కురిసిన కుండపోత వర్షంతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. రాత్రి సుమారు రెండు గంటల పాటు వర్షం దంచికొట్టడంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ చెరువును తలపించింది.
పలు దుకాణాలు, ఇండ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. డివిజన్లోని ఆరు మండలాల్లో కేవలం రెండుగంటల్లో 12సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. ఎల్లమ్మ చెరువు నిండుకుండలా మారి మత్తడి దుంకేందుకు సిద్ధంగా ఉండగా చుట్టుపక్కల మండలాల్లోని చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. బెజ్జంకి మండలంలో 65.3మి. మీటర్ల వర్షం పడగా కోహెడలో 150.2మి. మీ, హుస్నాబాద్‌లో 124.4మి.మీ, అక్కన్నపేట మండలంలో 110.4మి.మీ, మద్దూరులో 130మి.మీ, ధూళిమిట్ట మండలంలో 140.2మి.మీటర్ల వర్షం పడినట్లు అధికారులు తెలిపారు.
కోహెడ, సెప్టెంబర్ 12: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో శుక్రవారం సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా పర్యటించారు. వాగులు, లోలెవర్ వంతెనలను పరిశీలించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముందుగా కోహెడ నుంచి కరీంనగర్ వెళ్లేదారిలోని ఇందూర్తి వాగును కలెక్టర్ పరిశీలించారు.
హుస్నాబాద్‌లో కురిసిన వర్షానికి ఎల్లమ్మవాగుపైగల బ్రిడ్జిపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. గొట్లమిట్ట నారాయఫూర్ మధ్యఒర్రె వాగు ఉధృతంగా ప్రహిహిస్తుండటంతో కలెక్టర్ కారులో వెళ్లక స్థానికులు సమకూర్చిన ట్రాక్టర్‌పై వెళ్లారు. ఈ ప్రాంతంలో వెంటనే హై లెవల్ బ్రిడ్జి మంజూరు చేసేందుకు కృషిచేస్తానని కలెక్టర్ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాని గొట్లమిట్ట, నారాయణపూర్, విజయనగర్‌కాలనీ ప్రజలు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు.