NIMZ Project Farmers | జహీరాబాద్, సెప్టెంబర్ 2 : జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టులో భూ సేకరణకు సంబంధించి ఉన్నతాధికారులను నియమించకపోవడంతో పరిహారం అందక తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని న్యాల్కల్ మండల హద్నూర్, రుక్మాపూర్ గ్రామాలకు చెందిన బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం హద్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత రెండు మూడు నెలల క్రితం నిమ్జ్ ప్రాజెక్టుకు డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అధికారులను నియమించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఫలితంగా భూసేకరణ నిలిచిపోవడంతోపాటు ఇది వరకే భూములు సేకరించిన బాధిత రైతులకు పరిహారం చెల్లింపు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిమ్జ్ ప్రాజెక్టు జాబితాలో తమ భూములు ఉండడంతో బ్యాంకుల్లో రుణాలు రెన్యూవల్ చేయడం లేదన్నారు. కొత్తగా రుణాలు కూడా ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ దారుణంగా మారిందన్నారు. బ్యాంకులతోపాటు ప్రైవేటుగా తీసుకున్న అప్పులకు రోజురోజుకు వడ్డీ ఎలా తీర్చాలో తెలియడం లేదంటున్నారు. కనీసం భూములను అమ్ముకొని పిల్లల పెళ్లిళ్లు చేద్దామన్నా అమ్ముకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు.
నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు ఇస్తామని, జనరల్ అవార్డు కింద పరిహారాన్ని అందించాలని పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు సంబంధిత ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోతుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకొని నిమ్జ్ ప్రాజెక్టులో డిప్యూటీ కలెక్టర్‌తోపాటు డిప్యూటీ తహసీల్దార్ తదితర పోస్టులను వెంటనే భర్తీ చేసి తమ సమస్యలను తీర్చాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఈ సమావేశంలో బాధిత రైతులు షబ్బీర్ ఖాన్, నరసింహారెడ్డి, సంగారెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత