కొండాపూర్, మే21: ప్రకృతి వనరులైన వాగులు, చెరువుల ఆక్రమణ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జోరుగా సాగుతోందని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈ నెల 14వ తేదీన ‘వాగు మాయం’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణలో ఒక కథనం ప్రచురితమైంది. రాజకీయ నాయకుల అండదండలతో రియల్టర్లు కబ్జాలకు పాల్పడుతున్నారని, గంగారం గ్రామంలో నూతనంగా ఒక వెంచర్ ఏర్పాటు చేసేందుకు అక్రమాలకు తెరలేపినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నట్లు ఆ కథనంలో పేర్కొంది. ఆ వెంచర్‌కు ఆనుకుని ఉన్న 200 మీటర్ల వాగును పూడ్చివేసి ఆక్రమించారని.. అందులో నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపింది. ఈ వార్తలపై స్పందించిన ఇరిగేషన్ అధికారులు.. రియల్టర్లు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు పుల్‌స్టాప్ పెట్టారు. వెంచర్‌ను పరిశీలించి, పనులను ఆపాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. పనులు ఆపకపోతే నోటీసులు కూడా జారీ చేస్తామని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక రియల్టర్లు పనులను ఆపివేశారు.
ఇరిగేషన్ అధికారులు స్పందనపై గంగారం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రియల్టర్లకు హెచ్చరికలపై సంబంధిత ఇరిగేషన్ అధికారి సుమంత్ రెడ్డిని వివరణ అడగ్గా.. సైట్‌ను పరిశీలించిన అనంతరం పనులను తక్షణమే ఆపేయాలంటూ సూచించినట్లు తెలిపారు. జంగమోని ఓడుక నుంచి కిందకు వచ్చే నీటికి బ్రిడ్జిలు, వంతెనలు చేపట్టరాదని సూచించారు. మళ్లీ ఈ పనులను ప్రారంభించినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సంబంధిత వెంచర్ యజమానులను అధికారులు హెచ్చరించారు.