మునిపల్లి, జూలై 03: మునిపల్లి మండలాన్ని (Munipalli) ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా.. మండలంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి పథంలో నడిపిస్తా.. దెబ్బతిన్న గ్రామాలు అన్ని బాగు చేయిస్తా.. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) చెప్పిన మాటలు ఇవి.. ఆయన ఇప్పుడు రాష్ట్ర మంత్రి. ప్రభుత్వంలో ప్రధానమైన శాఖల్లో ఒకటైన వైద్యారోగ్య శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎన్నికల ప్రచారంలో తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారని మునిపల్లి మండల వాసులు విమర్శిస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిపల్లి మండలంలో పాలొన్న దామోదరా.. బీఆర్ఎస్ పార్టీపై లేనిపోని నిందలు వేసి, ప్రజలను నమ్మించి మోసం చేసి, ఇచ్చిన మాటను పూర్తిగా మరిచిపోయినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన మునిపల్లి గ్రామ శివారులో నుంచి బుసరెడ్డిపల్లి, తాటిపల్లి నుంచి చిలపల్లి, గార్లపల్లి గ్రామాల వరకు వెళ్లే రోడ్లు బాగు చేస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చి, నేడు వాటి బాగు గురించి ఊసెత్తకపోవడంపై మండిపడుతున్నారు. బుసరెడ్డిపల్లి గ్రామ శివారులో సింగూర్ ప్రాజెక్టు ఉండడంతో చుట్టు పక్కల ప్రాంతాల వారితోపాటు.. రంగారెడ్డి, వికారాబాద్, తాండూరు, జహీరాబాద్, బీదర్, కర్ణాటక ప్రాంతాల వారు నిత్యం ఇక్కడకి వస్తుంటారు. మునిపల్లి-బుసరెడ్డిపల్లి మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా మండలంలోని తాటిపల్లి-పెద్దలోడి, చిలపల్లి, గార్లపల్లి గ్రామలా మధ్య రోడ్డు సైతం పూర్తిగా దెబ్బ తినడంతో ఆయా మార్గాల్లో ప్రయాణించాలంటేనే జంకుతున్నారు.
ఎన్నికలప్పుడు మునిపల్లి మండలాన్ని అభిరంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పిన మంత్రి నేడు ఇటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పెద్దగోపులారం గ్రామ శివారులో ఉన్న సుమారు 20ఎకరాల ప్రభుత్వ భూమిలో నవోదయ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు హడావిడి చేశారని, తీరా దానిని మరో మండలానికి తరలించారని మండిపడుతున్నారు. మంత్రి తీరుపై సొంత పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.