పటాన్చెరు, సెప్టెంబర్ 21: శంకర్ పల్లి, పాశమైలారం పారిశ్రామిక వాడ వెళ్లే ప్రధాన రోడ్డుపై కర్దనూర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని కర్దనూర్ చౌరస్తా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య నెలకొం టుంది. పటాన్ చెరు, ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వైపు నుంచి భారీ వాహనాలు పాశ మైలారం పారిశ్రామిక వాడకు రావడం, చౌరస్తా వద్ద అసంపూర్తిగా రోడ్డు పనులు ఉండడంతో ప్రతిరోజు వాహనాలు నిలిచిపోతున్నాయి.
రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన సాగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
పారిశ్రామిక వాడకు వెళ్లి రోడ్డుపై వర్షపు నీరు నిలవడం గుంతలు పడడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిరోజు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నారు. ట్రాఫిక్ జామ్ తో సమయం వృధా కావడంతో పాటు వాయు కాలుష్యం పెరిగిపోతుంది.
హాల్సిటల్కు వెళ్లే రోగులు సమయానికి వెళ్లలేకపోతున్నారు. పారిశ్రామిక వాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వారు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. కిలోమీటర్ మేరా నిలిచిపోయిన ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.